కేంద్రమే జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలి

కేంద్రమే జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలి

హైద‌రాబాద్ : కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఆయా రాష్ట్రాల‌ ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. బీఆర్కే భ‌వ‌న్ నుంచి తెలంగాణ త‌ర‌పున ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాల‌న్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పరిహారం పోందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలి. ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు‌ చేశారు. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్ మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలి అని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ 24 వేల కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 2638 కోట్లు రావాల్సి ఉందని , ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. అదే విధంగా రివర్స్ అండ్ ల్ఫాప్స్డ్ ఐజీఎస్టీ ఐటీసీ కూడా రాష్ట్రాలకు కొద్దికాలంగా ఇవ్వడం ‌లేద‌ని, . ఇందులో తెలంగాణ కు రావాల్సిన వేయి కోట్లు వెంటనే విడుదల చేయాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

అయితే వారం రోజుల్లో ఐజీఎస్టీ మొత్తం 24 వేల‌కోట్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మరింత‌ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించేందుకు ఈ నెల‌ 12 తేదీన మరో మారు సమావేశం ‌కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.