
- పహల్గాం దాడి కలచివేసింది: హరీశ్ రావు
- మల్లారెడ్డి హెల్త్ వర్సిటీలో ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: పహల్గాంలో మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం ప్రజల మనసులను కలచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎన్నో ఏండ్లు ఓపికగా చూశామని, సహనానికీ ఓ హద్దు ఉంటుందని.. ఇకపై భరించే ఓపిక లేదన్నారు. దేశ ప్రజల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమని చెప్పారు. శనివారం సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో సైనికులు, ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు.
మన దేశ సైనికులను చూసి గర్వపడుతున్నామన్నారు. సరిహద్దులంటే భౌగోళికంగానే కాకుండా.. దేశ ప్రజల భద్రత, భవిష్యత్ కూడా అని చెప్పారు. దానిని నిలబెట్టేందుకే సైనికులు పోరాడుతున్నారన్నారు. పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయినా.. మనల్ని ఇబ్బంది పెట్టందుకే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. ‘‘ముంబైలో తాజ్హోటల్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు.
వారంతా పాకిస్తాన్ పంపిన టెర్రరిస్టులని ప్రపంచం ముందు ఆ దేశాన్ని దోషిగా నిలబెట్టాం. అమెరికా వంటి దేశాలపైనా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి దాడులకు తెగబడ్డారు. దేశం మీద జరుగుతున్న దాడికి పరిష్కారంగా ఉగ్రవాదులపై దాడి చేయడం సరైన చర్యే. ఇలాంటి సమయంలో దేశంలోని యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలి’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.