ప్రభుత్వాసుపత్రుల్లో బూస్టర్ డోస్ కు అనుమతివ్వండి

ప్రభుత్వాసుపత్రుల్లో బూస్టర్ డోస్ కు అనుమతివ్వండి

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులలో బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని కేంద్రానికి మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 32లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉందని..ఆ వ్యాక్సిన్ తేదీ గడువు ముగిసేలోగా బూస్టర్ డోసుకు అనుమతిస్తే ఉపయోగం ఉంటుందన్నారు.  ఇంటింటికి వ్యాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికీ టీకాలు వేసినట్లు వెల్లడించారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో అర్హులైన వారికి బూస్టర్ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తి అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు. 

ప్రస్తుతం 60ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం అనుమతించినట్లు తెలిపారు. 18ఏళ్లు పైబడిన వారికి ఏప్రిల్ 10 నుంచి బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే అనుమతించారని..అయితే ప్రైవేటుతో పాటు ప్రభుత్వాసుపత్రులలోనూ  బూస్టర్ డోసుకు అనుమతించాలని కోరారు.రాష్ట్రంలో 12ఏళ్లు పైబడిన వారికి మొదటి డోసు 104.78, రెండో డోసు 99.72 శాతం పూర్తయిందన్నారు. ఇక టీబీ నిర్మూలన కోసం కేంద్రం అమలు చేస్తున్న నిక్షయ్ మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. దానిని రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తామని వెల్లడించారు.