వ్యాక్సినేషన్​ జల్దీ పూర్తి కావాలె

వ్యాక్సినేషన్​ జల్దీ పూర్తి కావాలె

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను వేగంగా పూర్తి చేయాలని, వీలైనంత తొందరగా అన్ని కేటగిరీల వాళ్లకూ 100 శాతం వ్యాక్సినేషన్​ అయ్యేలా చూడాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు ఆదేశించారు. ఆదివారం ఉదయం అన్ని జిల్లాల డీఎంహెచ్​వోలు, ఇమ్యునైజేషన్​ ఆఫీసర్లు, మెడికల్​ ఆఫీసర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు, ఫీవర్​ సర్వే, వ్యాక్సినేషన్​ తదితర అంశాలపై చర్చించారు. వ్యాక్సినేషన్​ తక్కువగా జరుగుతున్న మండలాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 18 ఏండ్లు నిండినోళ్లందరికీ రెండు డోసులు, 60 ఏండ్లపైనున్న వాళ్లు, ఇతర జబ్బులతో బాధపడేటోళ్లు, ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు ప్రికాషన్​ డోసు, టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సినేషన్​ అన్ని జిల్లాల్లో 100 శాతం పూర్తి కావాలన్నారు. 31 జిల్లాల్లో పెద్దోళ్లందరికీ 100 శాతం ఫస్ట్​ డోస్​ టీకాలు పూర్తయ్యాయని, నిజామాబాద్​, కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాల్లోనూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, 18 ఏండ్లు నిండినోళ్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్​ను పూర్తి చేసిన కరీంనగర్​, హనుమకొండ జిల్లాలను, టీనేజర్లకు 100 శాతం పూర్తి చేసిన హనుమకొండ జిల్లా అధికారులను హరీశ్​ మెచ్చుకున్నారు. 

ఫీవర్​ సర్వేతో మంచి ఫలితాలు
దవాఖాన్లలో కరోనా ఓపీ క్లినిక్​లు, ఫీవర్​ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని, కరోనా వ్యాప్తిని కంట్రోల్​ చేయగలుగుతున్నామని హరీశ్​ అన్నారు. సర్వేలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఫీవర్​ సర్వేలో ఇప్పటిదాకా కోటికి పైగా ఇండ్లను కవర్ చేశామని, అన్ని జిల్లాల్లో మొదటి రౌండ్​ సర్వే పూర్తయిందని చెప్పారు. రెండో రౌండ్​ సర్వే కొనసాగుతోందన్నారు. కరోనా ఓపీ కొనసాగించడంతో పాటు.. ఎక్కడైనా కేసులు పెరుగుతున్నాయనిపిస్తే అవసరాన్ని బట్టి ఫీవర్​ సర్వే చేయాలని సూచించారు. కరోనా సేవలతో పాటు మామూలు వైద్య సేవలు, ఎన్​సీడీ స్క్రీనింగ్​, ఇతర పరీక్షలను డయాగ్నస్టిక్​ కేంద్రాల్లో అందేలా చూడాలని ఆదేశించారు.