
తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణి కావాలంటూ సీఎం కేసీఆర్ కన్న కలలు నిజం కావాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదంగా మారిందని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాత్రింబవళ్లు, ఒక ఇంజనీర్ లా కష్టపడి ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపకల్పన చేశారని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేసిన హరీష్ రావు… కాళేశ్వరం ప్రారంభం… తెలంగాణ ఉద్యమ విజయం అనీ.. రాష్ట్ర ప్రజల గొప్ప విజయం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రేపు అద్భుతాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని చెప్పారు. కరువును పారదోలే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. ఈరోజును సిద్ధిపేట నియోజకవర్గంలో పండుగగా, వేడుకగా సంబురాలు చేసుకోవాలని గ్రామ గ్రామాన సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాలు , పార్టీ శ్రేణులు ఈ సంబురాల్లో పాల్గొని ఘనంగా నిర్వహించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.