
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జన్మనిచ్చిన నేలను, చదువు నేర్చుకున్న పాఠశాలను మర్చిపోవద్దని అన్నారు మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మల్టీ పర్పస్ హైస్కూలు)లో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.
అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాకముందు ఈ పాఠశాల నిర్మాణం జరిగిందని, ఇప్పుడు 75 ఏండ్ల ప్లాటినం ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బడి అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఊరందరికి ఉమ్మడి గుడి అని చెప్పారు. బడి అనేది ప్రజల ఆస్తిగా భావించాలన్నారు.ఈ హైస్కూలు ఎంతోమంది గొప్ప వాళ్లను అందించిందని చెప్పారు. ఇక్కడ చదువుకున్నవాళ్లు.. ఎమ్మెల్యేలతో పాటు వివిధ రంగాల్లో ఉన్నారని అన్నారు హరీశ్ రావు. ప్రతివ్యక్తిలో దానం చేసే గుణం ఉండాలని, మనం చదివిన పాఠశాలను జట్టుగా కదిలి కాపాడుకుందామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను మనం సంరక్షించాలి అని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
సిద్దిపేట కు గొప్ప చరిత్ర ఉన్నదని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. 1969 తెలంగాణ ఉద్యమంలో మొదటి ఎమ్మెల్యే ను ఇచ్చింది సిద్దిపేటనే అని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే ను ఇచ్చింది ఈ నియోజక వర్గమే అని చెప్పారు. నాడు మదన్ మోహన్, నేడు సీఎం కేసీఆర్ ను ఇచ్చింది సిద్దిపేటే అని అన్నారు.