33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తం : హరీశ్ రావు

33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తం : హరీశ్ రావు

రాష్ట్రంలో వైద్య రంగం అద్భుతంగా పనిచేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొత్తగా ఎంపికచేసిన 929 మంది డాక్టర్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా కొత్త వైద్య నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. ఎంబీబీఎస్ సీట్లలో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేసులో, పీజీ సీట్లలో 2వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ వైద్యం అందించడంతో తెలంగాణ 3వ స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని డాక్టర్లకు పిలుపునిచ్చిన హరీశ్.. ఆరోగ్య శ్రీ సేవలను పీహెచ్సీలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

డబ్బు పెట్టి ఏదైనా కొనొచ్చుగానీ ప్రాణాలు కొనలేమని, అలాంటి ప్రాణాలు కాపాడే శక్తి ఒక్క డాక్టర్స్కే ఉందని హరీశ్ రావు అన్నారు. కొత్త డాక్టర్ల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పారదర్శకంగా పూర్తి చేశామన్న ఆయన.. వారందరూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. కొత్తగా నియమితులైన డాక్టర్లందరికీ పీజీ సీట్లలో రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ఇచ్చిన పోస్టింగ్ లలో పని చేసి ప్రజల మన్ననలు పొందాలే తప్ప ట్రాన్స్ ఫర్ల కోసం ప్రయత్నించవద్దని హరీశ్ రావు సూచించారు.