వరంగల్, వెలుగు: సీఎం రేవంత్‍రెడ్డికి ఫ్యూచర్ సిటీపైనున్న ధ్యాస.. పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీపై లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం వరంగల్‌లో సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు. బీఆర్‍ఎస్ పోరాటం వల్లే సీఎం రేవంత్‍రెడ్డి దేవాదులకు వెళ్లి రివ్యూ చేశారని, అన్ని మోటార్లు నడపాలని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు.
దేవాదుల ప్రాజెక్ట్‌కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.7,300 కోట్లు ఖర్చుచేసి 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెడ్‍లైన్లు పెడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గోదావరిపై బ్యారేజీలు నిర్మించి గోదావరిని నిండుకుండలా ఉంచామని, 9 ఏండ్లలో 48 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో కనీసం లక్ష ఎకరాలకైనా నీరిచ్చారా? అని ప్రశ్నించారు.
గోదావరి నదీజలాలపై అసెంబ్లీలో చర్చిద్దామన్న సీఎం రేవంత్‍రెడ్డి సవాల్‍ను తాము స్వీకరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‍కు మంచిపేరు వస్తుందన్న అక్కసుతోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. సీఎం, హెల్త్ మినిస్టర్ ఒక్కసారి కూడా పనులు పరిశీలించలేదని, కనీసం ఎంజీఎం హాస్పిటల్‌ను కూడా సందర్శించలేదన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు పాత ముచ్చటేనని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‍రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‍రెడ్డి, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
మీరు ప్రజాధనం వృథా చేస్తే.. మేం ఆదా చేశాం : మంత్రి దామోదర
హైదరాబాద్: ‘‘ప్లాన్ల పేరుతో మీరు ప్రజాధనం వృథా చేశారు. ఇష్టమొచ్చినట్టు డిజైన్లు మార్చి కోట్ల రూపాయలు నీళ్లపాలు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అడ్డగోలుగా పెంచిన నిర్మాణ వ్యయాన్ని తగ్గించి రూ.300 కోట్లు ఆదా చేశాం’’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న విమర్శలకు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో కౌంటర్ఇచ్చారు.
‘‘వరంగల్ ఆస్పత్రిని ప్రచార ఆర్భాటం కోసం బిల్డింగ్ కోడ్ ఉల్లంఘించి కట్టారు. మొదట 16.5 లక్షల ఎస్‌ఎఫ్‌టీ అని చెప్పి, ఆ తర్వాత 21.3 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి పెంచారు. మూడు నెలలకోసారి ప్లాన్లు మారుస్తూ.. కట్టడం, కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. 2022 జూన్ వరకు పనులే మొదలుపెట్టలేదు. మీరు దిగిపోయే నాటికి అక్కడ 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే 24 అంతస్తుల స్లాబులు వేశారు’’ అని విమర్శించారు. తాము వచ్చాక ఆ అస్తవ్యస్త విధానాలను సరిచేసి ప్రజాధనాన్ని ఆదా చేశామన్నారు.
