- మరి బడ్జెట్ పేపర్లు చింపకుంటే ఏం చేస్తరు?
- 6 గ్యారంటీలు అమలు చేయలేదనే చెవిలో పూలతో నిరసన
- కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు 16,978 మాత్రమే..
- సభను మరో వారం పాటు పొడిగించాలని డిమాండ్
- రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్సే.. కేసీఆరే నెక్స్ట్ సీఎం
- తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ గెల్వడు
- బీఆర్ఎస్ఎల్పీలో చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గతంలో కేటాయించిన బడ్జెట్లో కేవలం 2 శాతం నిధులే ఖర్చు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. చాలా ఉప కులాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని.. మరి బడ్జెట్ పేపర్లు చించకపోతే ఏం చేయాలని నిలదీశారు. బుధవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.
6 గ్యారంటీలు అమలు కాలేదు కాబట్టే చెవిలో పూలతో నిరసన తెలిపామన్నారు. సభ జరుగుతున్న తీరు అస్సలు బాగా లేదని, పద్ధతి లేకుండా నడుపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అడిగిన రెండు ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారని, గంటన్నర సేపు కావాలనే హౌసింగ్‌పై సాగదీశారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు.. 16 నోటిఫికేషన్లతో 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం బదులిచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే.. వాటికి సంబంధించి 50,785 మందికి కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే సభను పొడిగించాలని, వారం రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని హరీశ్ డిమాండ్ చేశారు.
వెల్ఫేర్‌కు సున్నా ..
వెల్ఫేర్ కార్పొరేషన్లకు ప్రభుత్వం చేసిందేమీ లేదని హరీశ్ రావు అన్నారు. వెల్ఫేర్ బోర్డ్స్ కార్పొరేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రశ్నిస్తే.. 33 కార్పొరేషన్లకుగానూ 16 కార్పొరేషన్లకే ఆఫీసులున్నాయని సమాధానమిచ్చారన్నారు. 33 కార్పొరేషన్లకు గత బడ్జెట్లో రూ.14,521 కోట్లు పెడితే.. రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో రజక ఫెడరేషన్‌కు రూ.386 కోట్లు పెట్టి.. రూ.కోటి ఖర్చు చేసినట్టు సమాధానం చెప్పారన్నారు. నాయిబ్రాహ్మణలకు రూ.280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు.
పద్మశాలీలు, మున్నూరుకాపులు, కృష్ణ బలిజ, మేర, పెరిక, విశ్వబ్రాహ్మణులు, శాలివాహన, సగర ఉప్పర, వాల్మీకి బోయ, భట్రాజు, మేదరలకు వంద కోట్ల చొప్పున బడ్జెట్లో ప్రతిపాదించినా.. ఒక్క పైసా ఖర్చు చెయ్యలేదని మండిపడ్డారు. ఆర్యవైశ్యలకు 25 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.1,370 కోట్లలో ఖర్చు చేసింది రూ.6 కోట్లేనన్నారు. ఎస్టీ కార్పొరేషన్ కు రూ.2,730 కోట్లు పెట్టి.. రూ.52 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ కు రూ.5,403 కోట్లు పెట్టి రూ.74 కోట్లే ఖర్చు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల నిధుల్లో 98 శాతం పక్కదారి పట్టించారని ఆరోపించారు.
సిద్దిపేటకొచ్చి పోటీ చెయ్
సిద్దిపేట నుంచి గెలిస్తే ఎవరికో మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పోటీ చేయాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఏ టైంలో గేమ్ ఎగ్జిట్ కావాలో.. ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసన్నారు. రేవంత్ వచ్చే ఎన్నికల్లో గెలవరని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని చెప్పారు. తలకిందులుగా తపస్సు చేసినా.. రేవంత్ మళ్లీ గెలవరన్నారు. బీఆర్ఎస్ గోల్ కొట్టి అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు.
