- కొత్తగా రియల్ ఎస్టేట్ స్కామ్‌కు తెరదీశారు: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమిట్.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలాగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అని ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీ వేదికగా.. రేవంత్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నదని విమర్శించారు. అందాల పోటీలు, ఏఐ సమిట్‌లాగానే గ్లోబల్ సమిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందన్నారు.
అది విజన్ డాక్యుమెంట్ కాదని, అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాల విజన్ లెస్ డాక్యుమెంట్ అని విమర్శించారు. గ్లోబల్ సమిట్ విజన్ డాక్యుమెంట్‌పై బుధవారం హరీశ్ స్పందించారు. ‘‘గ్లోబల్ సమిట్‌కు 18 రాష్ట్రాల సీఎంలు, 5 వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తరన్నరు. మంత్రులు పోయి ఒక్కో ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించారు. కనీసం ఒక్క సీఎం కూడా రాలేదు. 5 వేల మంది విదేశీ ప్రతినిధులూ రాలేదు.
ఒక్క మీ పార్టనర్ డీకే శివకుమార్ తప్ప.. చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి. గ్లోబల్ సమిట్‌లో గ్లోబల్ రిప్రెజెంటేటివ్స్ కరువయ్యారు. ఆఖరుకు ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోట్ వేసి కూర్చోబెట్టారు. గ్లోబల్ సమిట్ కాదది.. లోకల్ సమిట్. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో ఇది. భూముల స్కాం.. పవర్ స్కాం.. లిక్కర్ స్కాం.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కామ్ మొదలు పెట్టిండు’’అని విమర్శించారు.
ఫార్మా సిటీ పక్క భూములు ముందుగానే రేవంత్ బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నారని, ఇప్పుడు గ్లోబల్ సమిట్ పెట్టి ఆ భూములను తెగనమ్మేందుకు ప్లాన్ వేశారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గ్లోబల్ సమిట్ వేదికగానే వివరించారని పేర్కొన్నారు.

