డీటీవో మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి..బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్

డీటీవో మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి..బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్

హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి డీటీవో వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక, బొగ్గు మాఫియాల వివరాలను బయటపెట్టాలన్నారు. డీటీవో మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలని, సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

న్యాయ విచారణ జరిపించాలి: కవిత

డీటీవో వెంకన్న మృతిపై టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాతో కొందరు స్థానిక నాయకులు కోట్లు కూడబెట్టుకుంటుంటే అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. 

నిందితులపై హత్య కేసు పెట్టాలి: జాజుల 

డీటీవో వెంకన్న మృతి విచారకరమని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షడు జాజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంకన్న కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.