మెదక్ లో గులాబీ జెండా ఎగరేస్తాం : హరీశ్ రావు 

మెదక్ లో గులాబీ జెండా ఎగరేస్తాం : హరీశ్ రావు 

సంగారెడ్డి, వెలుగు: మెదక్ పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ ను గెలిపించినట్లుగా మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి మంచోడైతే దుబ్బాకలో గెలవాలి కదా.. ఆయన పనితీరు బాగోలేదని 54 వేల ఓట్ల మెజార్టీతో దుబ్బాకలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ, రైతు బంధు, పింఛన్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓటు అడుగుతారని ప్రశ్నించారు.
 
 గెలిపిస్తే రూ.100 కోట్లతో ట్రస్ట్​

మెదక్ ఎంపీగా గెలిపిస్తే పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత విద్య అందిస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి​రెడ్డి హామీ ఇచ్చారు. 25 ఏళ్ల సర్వీసులో 11 ఏళ్లు ఉమ్మడి మెదక్‌లో సేవలు అందించానని తెలిపారు. తాను ఏనాడూ ప్రజలకు దూరంగా లేనని 25 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశానన్నారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

డిపాజిట్లు రాని బీజేపీకి ఓట్లు వేయొద్దు

మెదక్: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ లో జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్  ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రామాలయం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తోందని, అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన కేసీఆర్ ఎప్పుడు రాజకీయాలకు వాడుకోలేదన్నారు. మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామిరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, వైస్ చైర్ పర్సన్ లావణ్య, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్​ హుసేన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.