కాళేశ్వరంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది : హరీష్ రావు

కాళేశ్వరంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది : హరీష్ రావు
  • తెలంగాణకు మరో దసరా పండుగ లాంటిది ఈ ప్రాజెక్టు
  • దసరా నాటికి నీళ్లు వచ్చే అవకాశం ఉంది
  • కాళేశ్వరం ప్రారంభం వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమన్నారు రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవిష్యత్తును, రైతుల దశను మార్చే ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసిన ఇంజినీర్లు, కార్మికులను ఆయన అభినందించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుని ప్రాజెక్టును పూర్తిచేసేందుకు వ్యూహాత్మకంగా పనిచేశామని చెప్పారు హరీష్. ఎంతపెద్ద ప్రాజెక్టునైనా మూడేళ్లలో పూర్తిచేయొచ్చని కాళేశ్వరంతో నిరూపించామన్నారు. ఓ ఇంజినీర్ లాగా కేసీఆర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని…. ప్రాజెక్టుతో రైతులకు ఓ నమ్మకం ఏర్పడిందన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ దగ్గర జరిగిన సంబరాల్లో హరీష్ పాల్గొన్నారు.

రానున్న రోజుల్లో 2 పంటలను చూడబోతున్నామని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేది కాదనీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమతో, ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తి అయిందన్నారు. “70 ఏళ్ల కాలంలో ఎన్నో పార్టీలు అధికారం మారాయి. కానీ 1 ఎకరానికి కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదు. 3 సంవత్సరాలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో సాగునీటి ఇస్తున్నాం. ప్రాజెక్ట్ ల కోసం ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో మంది కష్టపడ్డారు. కొంతమంది రైతులు భూములు కోల్పోయినా సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ  పూర్తి చేసుకున్నాం. దసరా పండగ వరకు ఈ సాగునీటి అందే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ ఎంత ముఖ్యమో.. ఇవాళ కాళేశ్వరం ప్రారంభం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి ప్రాజెక్ట్ పనుల్లో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది” అన్నారు హరీష్ రావు.