జనగామ, వెలుగు: జనగామ ప్రజలను మాజీ మంత్రి హరీశ్‌రావు మోసం చేశాడని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆయిల్ పామ్ సాగు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జనగామకు మంజూరైన ఆయిల్ పామ్ కంపెనీని అప్పటి మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాకు తరలించుకుపోయాడని ఆరోపించారు.
ఆ కంపెనీ ఇక్కడే ఉంటే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించేవని తెలిపారు. రైతులు పంటల మార్పిడి పద్ధతిని అనుసరించాలని ఆయన సూచించారు. ఈ విధానం వల్ల భూమిలో సారం పెరుగుతుందని చెప్పారు. వరి సాగును తగ్గించి ఆదాయం ఎక్కువగా వచ్చే ఆయిల్ పామ్ సాగును పెంచాలని రైతులకు సూచించారు. మూడేళ్లు ఈ పంటను సంరక్షిస్తే 30 సంవత్సరాలు ఆ పంట కుటుంబాన్ని ఆదుకుంటుందని పేర్కొన్నారు.
వరి సాగు చేస్తే ఎకరానికి సుమారు రూ.16 వేల లాభం మాత్రమే వస్తుందని, ఆయిల్ పామ్ సాగు చేస్తే ఎకరానికి రూ.1.50 లక్షల వరకు లాభం పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగును విస్తరించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ పనిచేస్తోందని వెల్లడించారు. ఈ సదస్సులో కాంగ్రెస్ జనగామ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పలువురు చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
