మిషన్ భగీరథ, లిఫ్ట్ల నిర్వహణకు నిధులివ్వండి

మిషన్ భగీరథ, లిఫ్ట్ల నిర్వహణకు నిధులివ్వండి

ఢిల్లీ,వెలుగు: మిషన్ భగీరథ, లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల ఐదేండ్ల నిర్వహణకు ఫండ్స్‌‌ ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్‌‌తో మంత్రి స‌‌మావేశం అయ్యారు. ఈ సదర్భంగా హరీశ్‌‌రావు.. సీఎం కేసీఆర్ రాసిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అంద‌‌జేశారు. తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు. మిషన్‌‌ భగీరథ, కాళేశ్వరం తదితర లిఫ్ట్‌‌ల నిర్వహణకు నిధులు ఇచ్చేలా చూడాలని కోరామన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను తెలిపామన్నారు. 83 మీటర్లు ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తున్నందున, లిఫ్ట్‌‌ ఇరిగేషన్ మెయింటనెన్స్‌‌కు చాలా ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. పాలమూరు, సీతారామ,  నెట్టంపాడు లిఫ్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు.  రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులున్నందున ఈ లిఫ్ట్‌‌ల నిర్వహణకు రూ.42 వేల కోట్ల నిధులివ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందని.. ఆ దిశలో గుజరాత్, తెలంగాణ ముందున్నాయని అన్నారు.  పథకంలో భాగంగా రాష్ట్రాలకు ఇచ్చే బడ్జెట్‌‌ను రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథ ఐదేండ్ల నిర్వహ‌‌ణకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. మంత్రి వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఢిల్లీ తెలంగాణ భ‌‌వ‌‌న్ ఆర్‌‌సీ గౌర‌‌వ్ ఉప్పల్  ఉన్నారు.