ఆందోళన విరమించిన డాక్టర్లు

ఆందోళన విరమించిన డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: తమ పరిధికి మించి ట్రీట్‌‌మెంట్ చేసే ఆర్‌‌‌‌ఎంపీలకు ప్రభుత్వం సపోర్ట్ చేయబోదని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. ఉన్నపళంగా ఆర్‌‌‌‌ఎంపీలు అందరినీ మూసేయడం సాధ్యం కాదని, గ్రామాల్లోకి క్వాలిఫైడ్ డాక్టర్లు వచ్చే కొద్దీ నకిలీలు ఆటోమేటిక్‌‌గా తగ్గిపోతారని పేర్కొన్నారు. ఆర్‌‌‌‌ఎంపీలకు ప్రభుత్వం తన మద్దతు విరమించుకోవాలని నిరసన తెలుపుతున్న డాక్టర్లను మంత్రి హరీశ్‌‌ చర్చలకు పిలిచారు. మంగళవారం ప్రగతి భవన్‌‌లో డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత తమ నిరసనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా హరీశ్‌‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు పెడుతున్నామని, ఇవన్నీ సక్సెస్ అయితే, ఆర్‌‌‌‌ఎంపీల వద్దకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు ఉండదని చెప్పారు. మంత్రితో భేటీ అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో యాంటీ క్వాకరీ కమిటీలు నియమించి, నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని డాక్టర్లు తెలిపారు. కమిటీల్లో అన్ని సంఘాల నుంచి డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇందుకోసం నెల రోజుల గడువు కోరారన్నారు. దీంతో నెల రోజులు తమ నిరసనను వాయిదా వేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్లు సంపత్‌‌రావు, బీఎన్‌‌ రావు, హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్‌‌, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌‌, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ వన్య జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.