కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీశ్ ఎక్కడ?

కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీశ్ ఎక్కడ?

రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​ సర్కారు సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్​ చేసింది. ఉద్యమంలో ముందుండి పోరాడిన హరీశ్​రావు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారు. సీఎం కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్​ ఇరిగేషన్​ సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను హరీశ్​ పరుగులు పెట్టించారు. ముఖ్యంగా కాళేశ్వరం పనులు వేగంగా జరిగేందుకు కృషి చేసిన ఆయన.. శుక్రవారం జరిగిన ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కనిపించకపోవడం తీవ్రమైన చర్చకు దారితీసింది. కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన జనం, రాజకీయ పార్టీల నేతలు హరీశ్​రావు లేకపోవడంపై రకరకాలుగా చర్చించుకోవడం కనిపించింది. దీనిపై సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. ప్రాజెక్టు సైట్లో ఉన్న ఇంజనీర్లు కూడా తమతో కలిసి పనిచేసిన, తమకు దిశానిర్దేశం చేసిన హరీశ్​ అక్కడికి వస్తారేమోనని ఎదురు చూశారు. ఇంత కీలకమైన కార్యక్రమంలో హరీశ్​ కనిపించకపోవడంపై ఆయన అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్​ఎస్​ సర్కారు తీరును సోషల్‌‌ మీడియాలో ట్రోల్‌‌ చేయడం కనిపించింది.

అంతా ఆయన గురించే..

సీఎం కేసీఆర్​ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్​ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ హరీశే​పర్యవేక్షించారని, దాదాపు 80 శాతం పనులు ఆయన ఆధ్వర్యంలోనే సాగాయని ఇంజనీర్లు గుర్తు చేసుకున్నారు. ప్రాజెక్టు ప్రాథమిక దశలో మహారాష్ట్రతో చర్చలు జరిపి, ఒక్క రూపాయి పరిహారం లేకుండా అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించారని టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం కనిపించింది. ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణం, ఇతర అనుమతుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి, తక్కువ సమయంలోనే సాధించారని వారు గుర్తు చేసుకున్నారు.

సైట్లోనే అడ్డా వేసి..

కేసీఆర్‌‌ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు హరీశ్​ రావు వంద రోజులకుపైగా సైట్‌‌లోనే నిద్రించి, రేయింబవళ్లు కష్టాపడ్డారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రాజెక్టు వేగంగా పూర్తవడంలో హరీశ్​దే క్రెడిట్‌‌ అని ప్రతిపక్ష నేతలూ పేర్కొంటున్నారు. ప్రాజెక్టు కోసం హరీశ్​ పడుతున్న కష్టాన్ని చూసిన గవర్నర్‌‌ నరసింహన్‌‌ ఒక సందర్భంలో.. ఆయనను ‘కాళేశ్వర్రావు’అని పిలిచి, ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. ఇంత చేసిన ఆయన ఇప్పుడు ప్రారంభోత్సవంలో ఎందుకు లేరని విస్తృతంగా చర్చ సాగింది. అయితే హరీశ్​కాళేశ్వరం రాకపోయినా సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్‌‌ రిజర్వాయర్‌‌ వద్ద పూజలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులను అక్కడి ప్రజలతో పంచుకున్నారు. ఇక టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ కూడా ప్రారంభోత్సవానికి వెళ్లకుండా అప్పర్​ మానేరు వద్ద రైతుల సమక్షంలో పూజలు చేశారు.