
తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాము చదువులు చెబితే బీజేపీ పేపర్ల్ లీక్ చేస్తుందని ఆరోపించారు. దొంగలను అరెస్ట్ చేశాక పరీక్షలు సాఫీగా జరుగుతున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. గీతారెడ్డి మంత్రిగా ఉండి చేసిందేం లేదన్నారు. నాడు ప్రైవేటు ఆసుపత్రులు మూడు పువ్వులు, అరు కాయలుగా ఉన్నాయని.. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకంతో వస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యంలో ఎంతో అభివృద్ధి చేశామని అనేక గురుకులాలు ప్రారంభించామని తెలిపారు. బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తుందని.. బోర్ల కాడ మీటర్లు పెట్టలేదని 30 వేల కోట్లు ఆపారని ఆరోపించారు హరీశ్. కరెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం నెలకు 1500 నుండి 2000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. 24 గంటల నాణ్యమైన కరెంటు నిరంతరంగా అందిస్తున్నామని తెలిపారు.
కేసీఆర్ బలమైన పునాదులు వేస్తే.. బీజేపీ వాళ్లు సమాధులు తవ్వమంటారని విమర్శించారు. మసీదుల గురించి మాట్లాడుతారు హిందువుల గురించి మాట్లాడుతారని అన్నారు . ఇవాళ హనుమాన్ జయంతి అని.. అందరూ బాగుండాలని అందరూ దేవుణ్ణి మొక్కుతారు కానీ బీజేపీ వాళ్ళవి కపట మొక్కులు, ఆపద మొక్కులని విమర్శించారు. కాలవెట్టేవాడు, కూలగొట్టేవాడు కావాలా? అభివృద్ధి పనులు చేసే వాడు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పనివి కూడా ఎన్నో అమలు చేశామని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ప్రతి గుండెల్లో,ప్రతి ఇంట్లో ఉన్నాడని చెప్పారు హరీశ్ రావు.