కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్ట్ బయటపెట్టారని విమర్శించారు. దేశంలో గతంలో ఎంతో మంది రాజకీయ నేతలపై ఎన్నో కమిషన్లు వేశారు.. న్యాయస్థానాల ముందు నిలబడవని చెప్పారు హరీశ్. కేసీఆర్ ను హింసించడమే రేవంత్ ఉద్దేశం ..అందుకే ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు.
పోలవరం మూడుసార్లు కుప్పకూలినా ఎన్డీఎస్ఎ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు హరీశ్ రావు. మేడిగడ్డలో చిన్న ఘటన జరగ్గానే అడగకుండాన ఎన్డీఎస్ఏ వచ్చిందన్నారు. తమకు నోటీసులు రాకుండానే మీడియాకు లీకులిస్తున్నారని చెప్పారు. కుట్రపూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తుందన్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్ట్ పెడితే ప్రభుత్వాన్నినిలదీసి వాస్తవాలను ప్రజల ముందుంచుతామన్నారు. 650 పేజీల నివేదికలో నచ్చిన అంశాలనే బయటపెట్టారని చెప్పారు.సీఎం రేవంత్ వరుస సీరియళ్లు నడుపుతున్నారని మండిపడ్డారు.
►ALSO READ | ఈ 22 మంది వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలు, నిర్లక్ష్యం
కేసీఆర్ హయాంలో మొదటి ఏడాదిలోనే కరెంట్ కొరత లేకుండా చేశారన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు హరీశ్. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు హరీశ్.
కాంగ్రెస్ హయాంలో తమ్మడిహట్టి దగ్గర దమ్మెడు మట్టి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు హరీశ్ రావు. తమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదని చెప్పారు. సీఎం రేవంత్ పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. రైతులకు ఎరువులు అందడం లేదు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఏ అనుమతి కావాలన్నా ప్రభుత్వం కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు హరీశ్ .
