ఈ 22 మంది వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలు, నిర్లక్ష్యం

ఈ 22 మంది వల్లే..  కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలు, నిర్లక్ష్యం

రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఒక నిపుణుల కమిటీ తుమ్మిడిహెట్టి,  మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి లాభనష్టాలను వివరంగా పరిశీలించిందని కాళేశ్వరం కమిషన్​ స్పష్టం చేసింది. ‘‘ఈ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదని,  అది ఆర్థికంగా లాభదాయకం కాదని తేల్చి చెప్పింది. మేడిగడ్డ బదులుగా ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. నాటి ప్రభుత్వం ఈ నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. నాటి ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో.. నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుందని చెప్పారు. 

దీన్ని బట్టి నివేదికను పరిగణనలోకి తీసుకోకపోవడం అనుకోకుండా జరిగి ఉండదు” అని కమిషన్ అభిప్రాయపడింది.  ‘‘నిపుణుల కమిటీ  నివేదికను 07.04.2015న ప్రభుత్వానికి సమర్పించిందని కానీ, ఆ నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందో లేదో నాటి ఇరిగేషన్​మంత్రి హరీశ్​రావు కమిషన్​కు  చెప్పలేదు. అందువల్ల.. నాటి సీఎం కేసీఆర్​, నీటిపారుదల శాఖ నాటి మంత్రి హరీశ్​రావు ఉద్దేశపూర్వకంగా ఈ నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు..’’ అని కమిషన్ నిర్ధారించింది.  ఆ నివేదికను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినందుకు ఎస్.కె.జోషి, సి.మురళీధర్,  బి.హరి రామ్ ను కమిషన్ బాధ్యులను చేసింది. భారీ ప్రజాధనం ఖర్చు చేసి మేడిగడ్డలో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి నాటి సీఎం, నాటి ఇరిగేషన్​ మంత్రికి వారు సహకరించారని తెలిపింది. 

బాధ్యులు వీళ్లే..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ సిఫార్సు చేసింది. వీరిలో 22 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు పేర్లను పేర్కొంది. మరికొందరి హోదాలను మాత్రం ప్రస్తావించింది. 

ఆ 22 మంది ఎవరంటే..?

రాజకీయ నాయకులు: కె. చంద్రశేఖర్ రావు, టి. హరీశ్​ రావు, ఈటల రాజేందర్

ఉన్నతాధికారులు: స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషి, సి. మురళీధర్

ఇంజనీర్లు/అధికారులు: బి. హరిరామ్, ఎన్. వెంకటేశ్వర్లు, టి. శ్రీనివాస్, ఎ. నరేందర్ రెడ్డి, కె.ఎస్.ఎస్. చంద్రశేఖర్, బసవరాజు, జె. శ్రీదేవి, జి. రమేష్, జె. ఆశీర్వాదం, మేడిగడ్డ సబ్‌స్టాంటియల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్ (సెప్టెంబరు 9, 2019) జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , మేడిగడ్డ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ (మార్చి 15, 2021) జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మేడిగడ్డ సబ్‌స్టాంటియల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్ సూపరింటెండింగ్ ఇంజనీర్,  మేడిగడ్డ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ సూపరింటెండింగ్ ఇంజనీర్, మేడిగడ్డ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్, అన్నారం బ్యారేజీ సర్టిఫికెట్ జారీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సుందిళ్ల బ్యారేజీ సర్టిఫికెట్ జారీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. 

ఇతర అధికారులు/ఇంజనీర్లు: 

ఫైనాన్స్ కార్యదర్శులు: జీవో నెంబర్లు 231, 232, 233 జారీలో పాల్గొన్నవారు.

ఇరిగేషన్ కార్యదర్శులు: పరిపాలనా ఆమోదాలు,  కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలలో ఉల్లంఘనలకు బాధ్యులు.
కేఐపీసీఎల్​ బోర్డు సభ్యులు: రుణాల సేకరణ, చెక్కుల జారీ, అక్రమ నిర్ణయాల ఆమోదంలో పాల్గొన్నవారు.
సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సభ్యులు: తప్పుడు డిజైన్లు, నిర్మాణ లోపాలకు బాధ్యులు.

నాణ్యత నియంత్రణ, నిర్మాణ పర్యవేక్షణ ఇంజనీర్లు: కాంక్రీట్ శాంపిల్స్ పరీక్షలలో నిర్లక్ష్యం, సెకంట్ పైల్స్ తనిఖీలలో లోపాలు.

స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ (ఎస్​ఎల్​ఎసీ) సభ్యులు: సవరించిన అంచనాలు, తప్పుడు సాంకేతిక సమర్థనలకు బాధ్యులు.