ప్రజలు ఎన్నుకున్నది సామంత ప్రభుత్వాన్నా? : హరీశ్రావు

ప్రజలు ఎన్నుకున్నది సామంత ప్రభుత్వాన్నా? : హరీశ్రావు
  • ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఢిల్లీ దర్బారులో మోకరిల్లేలా చేస్తున్నరు: హరీశ్​రావు
  •     సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలు అమలు కాలే
  •     స్కీములు లేవుగాని.. స్కాములను మాత్రం పక్కాగా అమలు చేస్తున్నరని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ హైకమాండ్​ రాష్ట్ర కేబినెట్​ను ఢిల్లీకి పిలిపించుకుని చేయబోతున్న సమీక్షను చూస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటున్నదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు విమర్శించారు. స్వయంపాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం.. ఇవాళ ఢిల్లీ దర్బారులో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తున్నదన్నారు. 

ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది స్వతంత్ర ప్రభుత్వాన్నా? లేదంటే ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సిద్ధరామయ్యకు బహిరంగ లేఖ రాశారు. 

వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని.. కానీ, రెండున్నరేండ్లవుతున్నా హామీలకు దిక్కు లేదని విమర్శించారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినా.. ఆ బిల్లు నిల్లయిందని, ప్రజల విశ్వాసం కిల్లయిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు స్వయంగా సోనియా గాంధీ బాండ్​ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారని, సీఎం నిర్వాకం వల్ల ఆ బాండ్లకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. 

వరంగల్​ రైతు డిక్లరేషన్​ పేరిట రాహుల్​ గాంధీ ఇచ్చిన హామీలను విస్మరించారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్​ క్యాలెండర్​ ప్రకటిస్తామని ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ కూడా మోసపూరితమైందని చెప్పారు. ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంచుతామని, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో మల్లికార్జున ఖర్గే అనేక హామీలు గుప్పించారని, వాటినీ అమలు చేయడం లేదని ఆరోపించారు.  

స్కీములు లేవు.. స్కాములే ఉన్నయ్​

స్కీములేవి లేకపోగా స్కాములు మాత్రం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయని హరీశ్​ విమర్శించారు. జాబుల క్యాలెండర్ లేదు గానీ.. స్కాముల క్యాలెండర్ సరిగ్గా అమలవుతున్నదన్నారు. 

హిల్ట్​పాలసీ స్కాం, సింగరేణి స్కాం, సోలార్ పవర్ స్కాం, సివిల్ సప్లై స్కాం, ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కాం, ఇసుక స్కాం, ఎక్సైజ్ స్కాం, ఆర్టీసీ స్కాం, అమృత్ స్కాం, కేఎల్ఎస్ఆర్ స్కాం, లగచర్ల-హెచ్ సీ యూ ల్యాండ్ స్కాం, పీజీ మెడికల్ సీట్స్ స్కాం.. ఇలా పూటకో స్కామ్​తో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నదని విమర్శించారు. దేశమంతా బుల్డోజర్​ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నామని నీతులు చెబుతున్నా కాంగ్రెస్​ హైకమాండ్.. ఇక్కడ సీఎం మాత్రం పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చి వేయిస్తున్నారని ఆరోపించారు.