హైదరాబాద్, వెలుగు: రాజకీయ పరంగా కాకుండా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుతానని, మంత్రులు సమాధానాలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బడ్జెట్ పద్దుల చర్చలో భాగంగా బుధవారం రాత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ మెగా సిటీ పరిధిలో వివిధ పారిశ్రామిక అవసరాలు, సర్కారు స్కీమ్‌ల కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 50 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకోవట్లేదా? చనిపోయిన, గాయపడిన గీత కార్మికులకు రెండేండ్లుగా ఎక్స్‌గ్రేషియా ఎందుకు ఇవ్వలేదు. ఈసారైనా యాసంగిలో సన్నవడ్లకు బోనస్ ఇస్తారా? ఇయ్యరా? గొల్ల కురుమలకు గొర్రెలను ఇచ్చేదెన్నడు? గత రెండేండ్లుగా కమర్షియల్ ట్యాక్స్‌లో ఆదాయం ఎందుకు తగ్గింది?’’అని ప్రశ్నించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయంలో 16 శాతం పెరుగుదల ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 6 శాతానికి పడిపోగా, గతేడాది అయితే 3 శాతానికి పడిపోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లిక్కర్ సప్లయర్స్‌కు 6 నుంచి 18 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించేదని, ఇప్పుడు గాయపడిన కార్మికులకు నష్ట పరిహారం కూడా అందడం లేదని ఆరోపించారు. కొందరు గీత కార్మికులు నడిపే కల్లు డిపోలను మూసివేసి వారిని జైళ్లలో పెడ్తున్నారని ఆయన విమర్శించారు.
పట్టాలిస్తామని.. భూములు లాక్కున్నరు
ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టా పాస్ బుక్కులిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు.. అధికారంలోకి వచ్చాక వారికి చెందిన 50 వేల ఎకరాల భూములను లాగేసుకుంటుందని హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాద్ మెగాసిటీ పరిధిలో పారిశ్రామిక పార్కులు, ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో ఆ భూములను తీసుకుంటుందన్నారు.
ఎంతో విలువైన సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో ఈ భూములను పారిశ్రామిక అవసరాలకు తక్కువ డబ్బులు చెల్లించి తీసుకోబోతుందని తెలిపారు. నిరుడు యాసంగిలో సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రూ.1,150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఈసారైనా బోనస్ ఇస్తారా? ఇవ్వరా? చెప్పాలని డిమాండ్ చేశారు.
సన్ ఫ్లవర్ పంట ఎకరానికి 8 క్వింటాళ్లు పండితే 6 క్వింటాళ్లు, మక్కలు 30 క్వింటాళ్లు పండితే 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని, మొత్తం పంటను కొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు నగదు బదిలీ చేసి రెండో విడత గొర్రెల పంపిణీ స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకు ఎందుకు ఈ స్కీమ్ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ స్కీమ్ అమలుపై ఈ బడ్జెట్ సెషన్‌లోనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
