ఆరు గ్యారంటీలు కాదు.. ఆరుగురు సీఎంలు మారడం గ్యారంటీ

ఆరు గ్యారంటీలు కాదు.. ఆరుగురు సీఎంలు మారడం గ్యారంటీ
  •     కాంగ్రెస్ పార్టీ హామీలపై మంత్రి హరీశ్ రావు
  •     త్వరలో బీఆర్ఎస్​ నుంచి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుందని వెల్లడి

పెద్దశంకరంపేట /నారాయణ్ ఖేడ్, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కాదని, ఆరు నెలలకు ఒక సీఎం మారుతాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరపేటలో మంగళవారం వంద డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం ‘గృహలక్ష్మి’ కింద 350 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. నారాయణఖేడ్​లోని వివిధ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల హరీశ్​రావు మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటివని, ఆ పార్టీ చెప్పే బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. 

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఆరు గంటలు మాత్రమే కరెంట్​ ఉంటుందని, వారానికి రెండు పవర్​హాలీడేస్​ ఉంటాయన్నారు. ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ వస్తుందని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో లేని స్కీములు ఇక్కడ అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి ఢిల్లీలో హైకమాండ్ ఉంటుందని, అక్కడివాళ్లు తుమ్మమంటే తుమ్మాలని, దగ్గ మంటే దగ్గాలని, కానీ బీఆర్ఎస్ కు ప్రజలే హైకమాండ్ అని అన్నారు. త్వరలో బీఆర్​ఎస్  మేనిఫెస్టో వస్తుందని, అది అద్భుతంగా ఉంటుందని హరీశ్​ రావు​ చెప్పారు.  కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, నారాయణఖేడ్​ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉమ్మడి మెదక్​ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.