బీజేపీ, కాంగ్రెస్ నేతలు గజినీల్లా వ్యవహరిస్తున్నరు : మంత్రి హరీష్ రావు 

బీజేపీ, కాంగ్రెస్ నేతలు గజినీల్లా వ్యవహరిస్తున్నరు : మంత్రి హరీష్ రావు 

గొల్ల కుర్మ, యాదవులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారని మంత్రి హరీష్ రావు చెప్పారు. అర్హులైన ప్రతీ గొల్ల కుర్మ యాదవులకు గొర్రెల యూనిట్ ను అందజేస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లాలో 17వేల మందికి యూనిట్లను పంపిణి చేస్తామని, ఇందుకోసం రూ.405 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. సిద్దిపేటలోని బైరి అంజయ్య గార్డెన్ లో రెండవ విడత గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడారు. 

గొల్ల కుర్మల సంక్షేమం కోసం ఇన్ని పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకంతో బాల్య వివాహాలు రద్దయ్యాయని చెప్పారు. గొల్ల కుర్మ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ముందున్నారని, ఇప్పటికే చాలా పదవులు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ లో గొప్పగా గొళ్ల కుర్మ యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని వివరించారు. సిద్దిపేటలో ఇప్పటికే ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించామన్నారు. 

గొల్ల కుర్మ యాదవుల సంస్మృతి చాలా గొప్పదని, బీరప్ప ఉత్సవాలు గొప్పగా నిర్వహిస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు. కొమురవెళ్లి మల్లన్న దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గొళ్ల కుర్మ యాదవజాతి  గౌరవాన్ని నిలబెడతామన్నారు. తమ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ కు గొల్ల కురుమ యాదవులు అండగా ఉండాలని కోరారు. 

సిద్దిపేట -జిల్లాలో 17 వేల మంది గొల్ల కుర్మ లబ్దిదారులతో త్వరలోనే సభ నిర్వహిస్తామని, వారందరికీ తానే భోజనాలు పెడుతానని మంత్రి  హరీష్ రావు చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో వినియోగించనంతగా ఇక్కడి ప్రజలు మాంసాన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మాంసాన్ని దిగుమతి చేసుకోకుండా.. ఇక్కడి గొల్ల కుర్మలకే గొర్రెలు ఇచ్చి మాంసం ఉత్పత్తి చేయడం కోసం రూ.11 వేల కోట్ల నిధులతో గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. 

ఇతర రాష్ట్రాల నాయకులు, ఇతర ప్రాంతాల ప్రతిపక్ష నాయకులు సైతం తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ ను చూసి ఆశ్చర్యపోయి.. ఇది హైదరాబాదా..? న్యూయార్క్ సిటీనా..? అని కేసీఆర్ ప్రభుత్వ పని తీరును అభినందించారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గజినీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు గల్లీలో తిడుతున్నారని, ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలను అన్ని దేశాలు ప్రశంసిస్తున్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. గొల్ల కుర్మల నైపుణ్యాన్ని, గొప్పదనాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కొనియాడారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పని వల్ల జీవాలకు నీటి కొరత లేకుండా పోయిందన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలె : జనగాం ఎమ్మెల్యే 

గొల్ల కుర్మలు పుట్టుకతోనే గొప్ప నైపుణ్యం కలిగిన వారని జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గొల్ల కుర్మ యాదవులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై కక్ష కట్టారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ అనుమతితోనే కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఖర్గేను నియమించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను దగ్గర పెట్టుకొని.. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ పథకాలు వద్దంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గొల్ల కుర్మలు బుద్ధి చెప్పాలని కోరారు.