రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిన్రు: హరీశ్ రావు

రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిన్రు: హరీశ్ రావు
  • పదేండ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేం ఒప్పుకోలే
  • పోతిరెడ్డిపాడు విస్తరణ టైమ్​లో మేం మంత్రులుగానే లేం
  • రాయలసీమ లిఫ్ట్​కు ఏపీ 2020 మే 5న జీవో ఇస్తే మేం కేంద్రానికి ఫిర్యాదు చేసినం
  • రేవంత్​కు సబ్జెక్ట్​ లేక గాయిగత్తర చేస్తున్నడు.. బూతులతో బుల్డోజ్​ చేస్తున్నడు
  • దగుల్భాజీతనాన్ని జనం ఎన్నటికీ సహించరు
  • నీళ్లపై అసెంబ్లీలో ఎంతసేపైనా చర్చకు సిద్ధమని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కుతినే పరిస్థితి తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. పదేండ్లు కేంద్రం ఒత్తిడి తెచ్చినా తాము ప్రాజెక్టులను అప్పగించలేదని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి ప్రెస్​మీట్​లో మితిమీరిన అహంకారంతో సంస్కారంలేని వికారమైన భాషతో వితండవాదన చేసిండు. ఆయన మాటలు మొత్తం అబద్ధాలే. ప్రజలు ఆయన ధోరణిని చూసి సీఎం ఇట్ల మాట్లాడ్తరా అని అసహ్యించుకుంటున్నరు” అని అన్నారు. తాము రేవంత్​లా మాట్లాడబోమని, సంస్కారంతో మాట్లాడుతామని ఆయన చెప్పారు.  కేసీఆర్​పై నీచమైన పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు సీఎం రేవంత్​ పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా పదేండ్లలో కేసీఆర్​ వాటిని కేంద్రానికి అప్పగించలేదని, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే అప్పగించేశారని అన్నారు. జనవరి 17, ఫిబ్రవరి ఒకటిన కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ మినిట్స్​లో శ్రీశైలం, నాగార్జున సాగర్​ కంపోనెంట్స్​అప్పగిస్తామని అంగీకరించినట్లు ఉందని తెలిపారు. నాగార్జునసాగర్​పైకి తెలంగాణ ఇంజనీర్లు వెళ్లాలన్నా సీఆర్పీఎఫ్​కు కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వాల్సిందేనని మినిట్స్​లోనే ఉందని ఆయన చెప్పారు. 

జనవరి 17న జలశక్తి శాఖ సమావేశంలోనే ప్రాజెక్టుల అప్పగింతకు రెండు రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేశాయని, అదే జరిగితే రాష్ట్ర హక్కులను కోల్పోతామని తాను ప్రెస్​మీట్​ పెట్టి మాట్లాడే వరకు ప్రభుత్వం స్పందించలేదని హరీశ్​ అన్నారు. ‘‘ఫిబ్రవరి 1న జరిగిన మీటింగ్​లో హైడల్​ ప్రాజెక్టులు మినహా మిగతా కంపోనెంట్లు ఇవ్వడానికి ఈఎన్సీ అంగీకరించారు. అదే విషయం మీడియాకు చెప్పారు. ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగించేసి.. ఇప్పుడు తాము అప్పగించలేదంటూ రంకెలేస్తున్నరు” అని మండిపడ్డారు.  

సెక్రటేరియెట్​లో పచ్చి అబద్ధాలు

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిందని హరీశ్​ ఆరోపించారు. అబద్ధపు పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలని చూస్తున్నారని విమర్శించారు. రేవంత్​ ప్రెస్​మీట్​లో అన్ని తప్పులే మాట్లాడారని దుయ్యబట్టారు. 2022లో నిర్వహించిన కేఆర్ఎంబీ16వ మీటింగ్​లోనే కేసీఆర్ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్లు సీఎం చెప్పారని.. కానీ ఆ మినిట్స్​లో తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని ఉందని అన్నారు. ‘‘17వ మీటింగ్​లో కృష్ణాలో 50 శాతం వాటా సహా కేఆర్ఎంబీ గెజిట్​లోని లోపాలపై చర్చించడానికి అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం నిర్వహించాలని పట్టుబట్టినం. అదే విషయం ఆ సమావేశం మినిట్స్​లోనూ ఉంది. ప్రాజెక్టులు అప్పగిస్తూ కేసీఆర్ స్వయంగా సంతకాలు పెట్టినట్లు సీఎం అబద్ధాలు చెప్పిండు. అసలు ఆ మీటింగ్​కు కేసీఆర్​ వెళ్లనే లేదు. సెక్రటేరియెట్​లో సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు. ఈ దగుల్భాజీతనాన్ని ప్రజలు సహించబోరు”అని కామెంట్స్​ చేశారు.  

అప్పుడు మేం మంత్రులుగా లేం

పోతిరెడ్డిపాడు విస్తరణ టైమ్​లో తాము అసలు మంత్రులుగానే లేమని, పదవుల కోసం పెదవులు మూసుకున్నది సీఎం రేవంత్​, ఆయన పక్కన ఇప్పుడు కూర్చున్న మంత్రులేనని హరీశ్​ దుయ్యబట్టారు. ‘‘వైఎస్​ పోతిరెడ్డిపాడు విస్తరణ తలపెడితే నాడు మా  ఎమ్మెల్యేలు 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశారు. మేం 2005 జులై 4న మంత్రి పదవులకు రాజీనామా చేసినం. పోతిరెడ్డిపాడు విస్తరణకు అప్పటి వైఎస్​ ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్​13న జీవో ఇచ్చింది. ఆ రోజు పోతిరెడ్డిపాడు విస్తరణపై మాతో గొంతు కలిపింది కాంగ్రెస్ ​నుంచి పీజేఆర్​ ఒక్కరే. ఉల్టా చోర్ ​కొత్వాల్​కో డాంటే అన్నట్టుగా రేవంత్​ తీరు ఉంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం 2020 మే 5న జీవో ఇస్తే అదే నెల 12న మేం కేంద్రానికి ఫిర్యాదు చేసినం. మా ఫిర్యాదుపైనే కేంద్రం రెండో అపెక్స్​ కౌన్సిల్​సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలోనే రాయలసీమ లిఫ్ట్​ స్కీంను కేసీఆర్ వ్యతిరేకించినట్టుగా మీటింగ్​మినిట్స్​లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలనే దానికి రేవంత్​ సమాధానం చెప్పాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. 

సాగర్​పై బలగాలను ఎందుకు తొలగించలే

సీఎం రేవంత్​కు సబ్జెక్ట్​లేక గాయి గత్తర చేస్తున్నారని, బూతులతో బుల్డోజ్​చేయాలని చూస్తే ఊరుకోబోమని చెప్పారు. ‘‘సీఎం సరిగా ప్రిపేర్​ కాకపోవడంతోనే బూతులు తిట్టిండు. కనీసం అసెంబ్లీకైనా ప్రిపేర్​ అయి రావాలి. మీరు ఎన్ని గంటలు అడిగితే అన్ని గంటలు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నం” అని హరీశ్​ తెలిపారు. బీఆర్ఎస్​ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్​పార్లమెంట్​లో కలిసి ప్రాజెక్టుల స్వాధీనం పున: సమీక్షించాలని కోరితే అది ముగిసిన అధ్యాయం అని చెప్పారని, అంటే సీఎం ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నది నిజమే కదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ ​ప్రభుత్వం వచ్చి రెండు నెలలవుతున్నా నాగార్జునసాగర్​పై సీఆర్పీఎఫ్ ​బలగాలను తొలగించి రాష్ట్ర పోలీసుల ఆధీనంలోకి ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

అమరుల త్యాగాలను ఉత్తమ్​ అవమానించిండు

‘‘తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లలో జరిగిన అన్యాయంపైన. అలాంటిది ఉమ్మడి ఏపీలోనే బాగుండే అని మంత్రి ఉత్తమ్​మాట్లాడటం ప్రొఫెసర్​ జయశంకర్​ సహా అమరుల త్యాగాలను అవమానించడమే. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి ఉత్తమ్ ​వైఎస్​, కిరణ్​కుమార్​ రెడ్డి వెంట ఉన్నడు. నల్గొండ జిల్లాను ముంచే పులిచింతల ప్రాజెక్టును పోలీస్​ పహారాలో నిర్మించేలా ఉత్తమ్​ లాంటి వాళ్లు సహకరించిన్రు. కృష్ణా నీళ్లు సమైక్య రాష్ట్రంలో ఏపీకి తరలించుకుపోతే కేసీఆర్ హయాంలో పంటపొలాలకు తరలించారు” అని హరీశ్​రావు అన్నారు.