ఒకటో తేదీన వేతనాలు ఉత్తమాటే: హరీశ్ రావు

ఒకటో తేదీన వేతనాలు ఉత్తమాటే: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవమని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. మోడల్ స్కూల్ టీచర్స్‌‌‌‌‌‌‌‌కి గత 7 నెలల నుంచి ఎప్పుడు కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. ఈ నెలలో ఇప్పటికే 13 రోజులు గడిచినా వారికి వేతనాలు అందలేదని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల 8న సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన సర్కారు.. రంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి మొత్తం 8 జిల్లాల్లోని  వెయ్యి మందికి పైగా రెగ్యులర్ టీచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇంకా వేతనాలు చెల్లించలేదన్నారు.

భేషజాలు వద్దు.. 

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర అలకించాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌‌‌‌ రావు విజ్ఞప్తి చేశారు. భేషజాలకు పోకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను పిలిచి చర్చించాలని కోరారు. వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అభాసుపాలు కావొద్దని సూచించారు.