
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన గెలిచే ప్రయత్నం చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఓట్ల కోసం బీజేపీ డబ్బు పంచడంతో పాటు 2వేల కార్లు, 2వేల బైకులు కొనిచ్చే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. తమ పార్టీ నాయకులకు కొనేందుకు సైతం వారు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. బైకులు, కార్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఆరా తీస్తున్నామని, వివరాలు అందిన వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మోటర్లు ఇస్తామంటున్న బీజేపీ నేతలు తర్వాత బావుల దగ్గర మీటర్లు పెడతారని అందుకే మునుగోడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. బీజేపీ చెప్పుకునేందుకు ఒక్క స్కీం కూడా లేదని అన్నారు. డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం, ప్రభుత్వ సంస్థల్ని అమ్మి దేశం ఆగం చేయడం తప్ప బీజేపీ చేసిందేంలేదని హరీష్ రావు విమర్శించారు. అగ్నిపథ్ స్కీంతో సైనికుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు.
మునుగోడులో గెలిచేది రాజగోపాల్ ధనమా లేక ప్రజాస్వామ్యమా అని హరీష్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోలేకే క్షుద్రపూజలు, మంత్రతంత్రాల పేరుతో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు ప్రవేశపెట్టిన ఘనత బీజేపీకే చెల్లిందన్న హరీష్.. బండి సంజయ్ రూ.50వేల ఫీజు కట్టి ఆ కోర్సులో చేరితే బాగుంటుందని చురకలంటిచారు.