
- మోడీ సర్కారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు : హరీశ్
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఎందుకివ్వట్లేదని ప్రశ్న
- వాళ్లు అధికారంలోకి వస్తే ఆర్టీసీనీ అమ్మేస్తరని కామెంట్
నర్సాపూర్/హైదరాబాద్, వెలుగు:కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉత్తుత్తి మాటలు తెలంగాణకు చెబుతూ.. డబ్బు మూటలను గుజరాత్ కు తరలిస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ డిపోను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు వ్యాపార ధోరణితో ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తోందని విమర్శించారు. రైల్వే ప్రైవేటీకరణలో భాగంగానే స్టేషన్లు, లైన్లను ఇతర సంస్థలకు అప్పగిస్తోందన్నారు. కేంద్రం తీరుతో ఆర్టీసీలాంటి సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని కూడా అమ్మేస్తారన్నారు. వరంగల్‌లో ఏర్పాటయ్యే కోచ్ ఫ్యాక్టరీని, గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్, ఐఆర్సీటీని గుజరాత్ కు తరలించి రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేసిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన 9 వేల కోట్లను కేంద్రం ఎగనామం పెట్టిందని ఆరోపించారు. నీతి ఆయోగ్ సూచన మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్ల గ్రాంటు ఇవ్వాల్సి ఉన్నా పైసా ఇవ్వలేదన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి మేరకే బస్ డిపో ఏర్పడిందన్నారు. కాళేశ్వరం ద్వారా వెల్దుర్తి వరకు నీళ్లు తెచ్చామని, మిగిలిన పనులు పూర్తి చేసి త్వరలో ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ఇస్తున్నారా? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? అని హరీశ్ ప్రశ్నించారు. మోకాళ్ల యాత్ర చేసినా రాష్ట్రంలో బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదని బండి సంజయ్ నుద్దేశించి అన్నారు.
ఆర్టీసీని కాపాడుకోవాలి: పువ్వాడ
నర్సాపూర్ డిపోకు కావాల్సినన్ని బస్సులు పెడతామని పువ్వాడ అజయ్ అన్నారు. రాష్ట్రం వచ్చాక ఏర్పడిన మొట్టమొదటి డిపో నర్సాపూర్ డిపో అని చెప్పారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు.
ఏడాదికి లక్ష కంటి ఆపరేషన్లు చేయాలె
రాష్ట్రంలో ఏటా 4 లక్షల కేటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతుంటే, అందులో 25 వేల ఆపరేషన్లు మాత్రమే ప్రభుత్వ దవాఖాన్లలో జరుగుతున్నాయని మంత్రి హరీశ్ అన్నారు. ఇకపై ఏడాదికి కనీసం లక్ష కేటరాక్ట్ ఆపరేషన్లు సర్కార్ దవాఖాన్లలో జరిగేలా చర్యలు తీసుకోవాలని బుధవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో హెల్త్ ఆఫీసర్లను, డాక్టర్లను ఆయన ఆదేశించారు. అన్ని జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో ఈ ఆపరేషన్లు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఎక్విప్‌మెంట్, మందులు అందజేస్తామన్నారు. పీహెచ్‌సీలలో, సీహెచ్‌సీలలో కంటి పరీక్షలు చేయాలని, ఆపరేషన్ అవసరమైన వారిని జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు రిఫర్ చేయాలని ఆదేశించారు. సిజేరియన్లు 61 శాతం నుంచి 58 శాతానికి తగ్గాయని, దీన్ని మరింత తగ్గించాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ రోగాలకు అవసరమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్లు అన్ని హాస్పిటల్స్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు.