ఢిల్లీలో ధర్నా అట్టర్ ఫ్లాప్ .. దీక్షకు కూతవేటు దూరంలో ఉన్నా రాహుల్ రాలే: హరీశ్‌‌రావు

ఢిల్లీలో ధర్నా అట్టర్ ఫ్లాప్ .. దీక్షకు కూతవేటు దూరంలో ఉన్నా రాహుల్ రాలే: హరీశ్‌‌రావు

హైదరాబాద్, వెలుగు:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో రేవంత్‌‌రెడ్డి బ్యాచ్ ధర్నా డ్రామా ఆడిందని, అదికూడా అట్టర్​ ఫ్లాప్​ అయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండికూడా రాహుల్ గాంధీ రాలేదని అన్నారు. తమకు బీసీల కన్నా బిహారే ముఖ్యమని మల్లికార్జున ఖర్గే కూడా రాలేదని బుధవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘‘బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై రాహుల్ గాంధీ, ఖర్గేలతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం లేదని సుస్పష్టం అయ్యింది. మేం గుజరాత్‌‌లో అడగలేదు, యూపీలో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్ గాంధీ ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం  అని ట్వీట్ చేస్తరు. 

ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా,  సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని మరో ప్రకటనలో విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళా సభ్యురాలి పట్ల ఇంత కర్కశంగా, అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.