3 గంటలు కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా..3 పంటలు పండించే పార్టీ కావాల్నా?

3 గంటలు కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా..3 పంటలు పండించే పార్టీ కావాల్నా?

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం మన రాష్ట్రంలోనే వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీ కరెంటు ఇస్తున్నామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ బీఆర్​ఎస్​సర్కారు నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్​రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బొంగులూర్‌‌‌‌లోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్​లో ‘అభివృద్ధి పనుల జాతర’ పేరుతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బీజేపోళ్లేమో బాయికాడ మీటర్లు పెట్టాలంటున్నరు.

కాంగ్రెసోళ్లేమో మూడు గంటల కరెంటు చాలంటున్రు.. మన కేసీఆరేమో మూడు పంటలు పండియ్యాలంటుండు.. మనకు మూడు పంటలు పండించే పార్టీ కావాల్నా.. మూడు గంటలు కరెంటిచ్చేటోళ్లు కావాల్నా.. మీటర్లు పెట్టే పార్టీ కావాల్నా.. దయచేసి మీరే ఆలోచించండి’ అని హరీశ్​అన్నారు. ‘రైతుల కోసం రైతుబంధు కింద రూ.72 వేల కోట్లు ఇచ్చాం. రైతు రుణమాఫీకి రూ.36 వేల కోట్లు ఖర్చుబెట్టాం. ఈ రకంగా రైతు రాజ్యం, రైతు సంక్షేమం కోసం బీఆర్​ఎస్​ ప్రభుత్వం పనిచేస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగా పనిచేస్తున్నాయి కాబట్టే.. సర్కారు ఆసుపత్రులకు ప్రజలు వస్తున్నరని హరీశ్​​ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి, జడ్పీ చైర్​ పర్సన్​ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.