ఆయుష్ సేవలు అందుబాటులోకి తేవాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

ఆయుష్ సేవలు అందుబాటులోకి తేవాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు:సిద్దిపేటలో ఆయుష్, యునాని, హోమియో హాస్పిటల్ సేవలను 15 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. సోమవారం ఆయుష్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అవసరమైన పనులపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి క్రిస్టియనా, టీజీఎం ఐడీసీ ఎండీ ఫణిందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శశి ధర్, ఈఈ రవీందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఆయుష్ ఆస్పత్రికి సంబంధించిన అన్ని సేవలు అందుబాటులోకి తేవాలని, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.

ఆయుష్, యునాని, హోమియోకి సంబంధించిన వైద్యులను, థెరపిస్టులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు వైద్య సేవలందించాలని కోరారు. నిర్మాణం లో ఉన్న వెయ్యి పడకల ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలన్నారు. కరీంనగర్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న నర్సింగ్ కాలేజీ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.  

పుల్లూరుపై కేసీఆర్ కి ఎంతో ప్రేమ 

పుల్లూరుపై కేసీఆర్ కి ఎంతో ప్రేమ ఉందని, పుల్లూరు నారసింహ క్షేత్రాన్ని సుమారు రూ.5 కోట్లతో అభివృద్ధి చేశామని హరీశ్ రావు అన్నారు. పుల్లూరు గ్రామంలో వెలసిన స్వయంభు లక్మి నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బండపైకి వాహనాలు వెళ్లడం కోసం రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, రూ.35 లక్షల టీటీడీ నిధులతో దేవాలయాన్ని పునరుద్ధరింప జేశామన్నారు. 

రూ.10 లక్షలతో దేవాలయం చుట్టూ షెడ్ నిర్మాణం, రూ.80 లక్షల తో తాగునీటి ట్యాంకునిర్మాణం, రూ.50 లక్షలతో బండపై కల్యాణ మండపం నిర్మించామన్నారు. మరో రూ. 50 లక్షలు మంజూరు అయ్యాయని ఆ నిధులతో అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో  జరగుతున్న ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు.