హామీలను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణ

హామీలను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణ
  • యూసుఫ్​గూడలో గడపగడపకూ పాదయాత్రకు హాజరు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ని ఓడిస్తేనే గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలవుతాయని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఆయన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను గడపగడపకూ ఆదివారం అందజేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

ప్రతి మహిళకు రూ.2,500 రావాలన్నా.. ప్రతి వృద్ధుడికి రూ.4,000 రావాలన్నా.. యువతకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి.  జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వమేమీ పడిపోదు. ఒక వేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా తమను గెలిపిస్తున్నారనే ధోరణిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తారు’’అని హరీశ్ అన్నారు. 

మద్యం, డబ్బుకు అమ్ముడుపోవద్దు

కాంగ్రెస్ పార్టీ.. ఒకవైపు డబ్బును, మరోవైపు అధికార దుర్వినియోగం చేసైనా గెలవాలని ప్రయత్నిస్తుందని హరీశ్ రావు అన్నారు. ‘‘మద్యం, డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్​కు ఓటేస్తే.. మన కంటిని మన వేలితోనే పొడుచుకున్నట్లు. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే ఆయన భార్య మాగంటి సునీతను గెలిపించుకోవాలి. ఇదే మాగంటి గోపీనాథ్ కు నిజమైన నివాళి అవుతది. మా హయాంలో మైనారిటీ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. రేవంత్ రెడ్డి పాలనలో మైనారిటీలకు కేబినెట్​లో చాన్స్ ఇయ్యలే. మహిళలంతా కలిసి సునీతను గెలిపించుకోవాలి’’అని హరీశ్ అన్నారు.