- ఎనిమిది మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినం: హరీశ్ రావు
- జీవోలు ఇచ్చినంత మాత్రాన తెచ్చినట్టు కాదు: మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలేజీలను పట్టించుకోకపోవడం వల్లే ఎన్‌ఎంసీ నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించలేదని విమర్శించారు. అయితే హరీశ్ రావు కామెంట్లకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కౌంటర్ ఇచ్చారు. జీవోలు ఇచ్చినంత మాత్రాన కాలేజీలు తెచ్చినట్టు కాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ముంగట జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా సౌలతులు కల్పించి, సిబ్బందిని నియమించి అనుమతులు తీసుకొచ్చామని వెల్లడించారు.
జిల్లాకో కాలేజీ ఏర్పాటు చేసినం: హరీశ్‌రావు
తెలంగాణ ఏర్పడే నాటికి ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తామే జిల్లాకో కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు అనుమతులు వచ్చిన 8 కాలేజీలు సహా మొత్తం 29 కాలేజీలను తామే ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ కల సాకారమైందని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, ములుగు, నర్సంపేట్, గద్వాల, నారాయణపేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తాము అధికారంలో ఉన్నప్పుడే నిధులు కేటాయించామని అందులో పేర్కొన్నారు. భూకేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం పర్మిషన్లు ఇచ్చామని చెప్పారు.
‘‘కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో 8 కాలేజీలకు గాను తొలుత నాలుగింటికే పర్మిషన్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో మిగిలిన 4 కాలేజీలకు ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు. కేంద్ర ఆరోగ్యశాఖ వద్ద సెకండ్ అప్పీల్ చేసి పర్మిషన్లు తీసుకొచ్చారు” అని తెలిపారు. గతంలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అందుకే రాష్ట్ర నిధులతోనే కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్ కు నాంది పలికిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తూ ప్రతిఏటా ఎన్ఎంసీ అనుమతులు (రెన్యూవల్) కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జీవోలిస్తే కాలేజీలు ఏర్పాటు చేసినట్టా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్లకు మంత్రి దామోదర రాజనర్సింహ గట్టిగానే బదులిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ముంగట జీవోలు ఇచ్చి, చేతులు దులుపుకున్నంత మాత్రాన కాలేజీలు రావన్న విషయాన్ని హరీశ్ రావు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ మేరకు మంత్రి దామోదర బుధవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎన్నికలకు ముంగట హడావిడిగా 8 కాలేజీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. కాలేజీ బిల్డింగ్ లేదు.. హాస్టల్ లేదు.. హాస్పిటల్ లేదు.. స్టాఫ్‌ను నియమించలేదు.. ఎక్విప్‌మెంట్ కొనలేదు. కానీ కాలేజీలు ఏర్పాటు చేసినట్టుగా డబ్బా కొట్టుకున్నారు. ఎన్‌ఎంసీ ఇన్‌స్పెక్షన్లలో వాళ్ల డొల్లతనమంతా బయటపడింది. కాలేజీలు ఇచ్చేది లేదని ఎన్‌ఎంసీ తేల్చి చెప్పింది. దీంతో మేం యుద్ధప్రాతిపదికన నిబంధనలకు అనుగుణంగా కాలేజీలను, హాస్పిటళ్లను ఏర్పాటు చేశాం.
ఫస్ట్ అప్పీల్‌లోనే ఎన్‌ఎంసీని ఒప్పించి ములుగు, గద్వాల, నారాయణపేట్, నర్సంపేట్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చాం. యాదాద్రి, మెదక్‌లో ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 220 బెడ్ల దవాఖాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. మేము అధికారంలోకి వచ్చే నాటికి కుత్బుల్లాపూర్, మహేశ్వరంలో అసలు దవాఖాన్లే లేవు. వనస్థలిపురం, మల్కాజ్‌గిరిలో ఉన్న 50 బెడ్ల దవాఖాన్లను 220 బెడ్లకు అప్‌గ్రేడ్ చేసి.. వాటిని టీచింగ్ హాస్పిటళ్లుగా తీర్చిదిద్దాం. అవే హాస్పిటళ్లను కుత్బుల్లాపూర్, మహేశ్వరం కాలేజీలకు అనుసంధానించాం. అన్ని కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించాం. సెకండ్ అప్పీల్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వద్దకు వెళ్లి వారిని ఒప్పించి, మెప్పించి.. యాదాద్రి, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చాం. కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ స్టూడెంట్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చాం” అని మంత్రి దామోదర తెలిపారు. ఇప్పటికైనా హరీశ్ అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మానుకోవాలని అన్నారు. ‘‘రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్‌ను గత బీఆర్‌ఎస్ సర్కార్ ఆగమాగం చేసింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇస్తూ పోయింది.
కానీ కాలేజీలు, హాస్పిటళ్లలో అవసరమైన సదుపాయాల కల్పనలో విఫలమైంది. అత్యంత నాణ్యమైనదిగా ఉండాల్సిన వైద్య విద్యను నాసిరకంగా తయారు చేసింది. గొప్పల కోసం మెడికల్ విద్యార్థుల భవిష్యత్తును, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ నాశనం చేసిన ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థను.. మేం ఇప్పుడు గాడినపెడుతున్నాం. అన్ని కాలేజీలు, హాస్పిటళ్లకు బిల్డింగులు నిర్మిస్తున్నాం. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమిస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్‌కు కొత్త దవాఖానను నిర్మిస్తున్నాం” అని వెల్లడించారు.