ఏఎన్‭ఎమ్‭ల సేవలను ప్రశంసించిన హరీష్ రావు

ఏఎన్‭ఎమ్‭ల సేవలను ప్రశంసించిన హరీష్ రావు

వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర రెండవ ఏఎన్‭ఎమ్‭ల మహా సభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో వారు అత్యంత సేవలు అందించారని వారిని ప్రశంసించారు. కరోనా వచ్చినప్పుడు వైద్య సిబ్బంది, పంచాయతీ మున్సిపల్, పోలీసులు మాత్రమే పనిచేశారని.. వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేశారని గుర్తుచేశారు. ప్రాథమిక వైద్యంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. 

నగరాల్లో ఉన్న బస్తీ దవాఖానాల్లో సేవలు మెరుగయ్యాయని హరీష్ రావు చెప్పారు. దీనివల్ల పెద్దాస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య తగ్గిందని అన్నారు. జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. 7 వందలు ఉన్న పల్లె దవాఖానాల సంఖ్యను 2వేలకు పెంచుతున్నామని తెలిపారు. పల్లె దవాఖానలో డాక్టర్ ను నియమిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  మౌలిక వసతులు మెరుగయ్యాయని అన్నారు. 2004లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం మాత్రమే ఉన్న డెలివరీలు.. ఇప్పుడు 67 శాతం అవుతున్నాయని పేర్కొన్నారు. మరో రెండు మూడు సంవత్సరాల్లో.. టీబీ రహిత రాష్ట్రం కావాలని అన్నారు. Anm సబ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.