బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయ్: హరీశ్ రావు

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయ్: హరీశ్ రావు
  • ప్రకటించగానే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయ్
  • నయవంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ 
  • ఒక్కో అసెంబ్లీ సీటును రూ.10 కోట్లకు అమ్ముకుంటన్నరు  
  • ప్రెస్​మీట్​లో మంత్రి హరీశ్ రావు కామెంట్స్

సిద్దిపేట, వెలుగు:  సీఎం కేసీఆర్ ​బీఆర్ఎస్​ మేనిఫెస్టో ప్రకటించగానే ప్రతిపక్ష లీడర్ల ఫ్యూజులు ఎగిరిపోయాయని మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. గుండెలు జారి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసినా ప్రెస్​మీట్​లో హరీశ్​మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పెద్దలా ఎంతో ఆలోచించి, ఆచితూచి మేనిఫెస్టోను తయారు చేస్తే, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను కాపీ కొట్టారనడం విడ్డూరంగా ఉందన్నారు. సీట్లు కావాలన్నా, పదవులు కావాలన్నా బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీకి పోవాలని, ఓట్లు కావాలంటే ఢిల్లీ లీడర్లు ఇక్కడికి రావాలని ఎద్దేవా చేశారు. రానే..రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపించిన లీడర్​కేసీఆర్ అన్నారు. ఆయనకు ఉన్నంత బాధ్యత ఎవరికీ ఉండదన్నారు. గత పాలకులు ముక్కిపోయిన, తుట్టెలు పట్టిన బియ్యం ఇస్తే.. ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మరో కొత్త పథకానికి రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తది అన్న విధంగా కేసీఆర్​తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్​మూడోసారి అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నమ్మకానికి మారుపేరు కేసీఆర్​ అయితే, ఒక్క చాన్స్​ అంటూ వస్తున్న కాంగ్రెస్​ పార్టీ నయవంచనకు మారుపేరు అని విమర్శించారు. అసెంబ్లీ టికెట్ల పంపిణీతో కాంగ్రెస్​లీడర్ల నిజస్వరూపం బయటపడుతోందన్నారు. ఒక్కో సీటును రూ.10 కోట్లకు లేదా 5 ఎకరాలకు అమ్ముకుంటున్నారంటూ ఆ పార్టీ లీడర్లే ఢిల్లీలో.. గల్లీలో.. బహిరంగంగా చెబుతున్నారని గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి నోట్లకి సీట్లు అమ్ముకుంటున్నాడని గాంధీభవన్​లోని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారన్నారు. కర్ణాటకలో  కాంగ్రెస్​అధికారంలోకి వచ్చినప్పటికీ, రోజుకో స్కామ్ తో కుదేలవుతోందన్నారు. తెలంగాణలో ఒక్కచాన్స్ అంటున్న ఆ పార్టీకి, గతంలో 11సార్లు చాన్స్​ఇచ్చినా ఏమీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. 

 స్క్రిప్ట్ లతో బీజేపీ నేతలు అభాసుపాలు

తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ అగ్రనేతలు ఇక్కడి బీజేపీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ లు చదివి అభాసుపాలవుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే బీఆర్ఎస్​ప్రభుత్వ పథకాలను కాఫీ కొట్టి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు క్యాండేట్లే లేరన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటివాళ్లు లోక్​సభ స్థానాలకు పోటీ చేస్తామంటూ తప్పించుకుంటున్నారని చెప్పారు. మోదీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై అక్కసు వెల్లగక్కారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని పొగిడిన బీజేపీ నేతలు రాజకీయం కోసం గల్లీలో తిట్టడం ఎంత వరకు సబబు అన్నారు. హరీశ్​రావుతో బీఆర్ఎస్ నేతలు రాజనర్సు, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.