
సిద్దిపేట జిల్లా : హుస్నాబాద్ నియోజకవర్గం పొట్లపల్లి గ్రామంలో స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాష్ట్ర టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. రాజేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు హరీష్ రావు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు హరీష్ రావు. ప్రభుత్వం చేసే అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనీ….సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో బంగారు తెలంగాణ సాకారం కావాలని ఆకాంక్షించారు. స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం అన్నారు. కాకతీయుల చరిత్రకు, అనవాళ్లకు నిలయం పొట్లపల్లి రాజన్న ఆలయం అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో…. వేములవాడ రాజన్న తర్వాత పొట్లపల్లి రాజన్న ఆలయమే ప్రసిద్ధ క్షేత్రమన్నారు. అటు వేములవాడ.. ఇటు కొత్తకొండ వీర భద్ర స్వామి మధ్యలో కొలువైన ఈ ఆలయం భవిష్యత్తులో పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకుంటుందని అన్నారు. రూ.కోటి తో దేవాలయం ముందు వాగులో.. చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామమని.. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు హరీష్ రావు.