హరితహారం : రైతులకు గంధం మొక్కలు

హరితహారం : రైతులకు గంధం మొక్కలు

హరితహారం మొక్కల పెంపకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ విడత రైతులే మొక్కల పెంపకం చేపట్టేలా ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌‌‌‌ నిర్ణయించిన నేపథ్యంలో ‘ఆగ్రో ఫారెస్ర్టీ’ విధానానికి శ్రీకారం చుట్టింది. కేవలం మొక్కలు ఇచ్చి పెంచమంటే రైతులు ఆసక్తి చూపరన్న ఉద్దేశంతో, ఆదాయాన్నిచ్చే ఈ సిస్టమ్​ను ఎంచుకుంది. చిన్న, సన్నకారు రైతులకు గంధం, వెదురు, టేకు, సరుగుడు వంటి ఆదాయాన్నిచ్చే మొక్కలు పంపిణీ చేయనున్నారు. అలాగే రోడ్లకు ఇరువైపులా ఒక్కో జిల్లాలో 15 నుంచి 20 కిలోమీటర్ల మేర చింత మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం 5 లక్షల చింత మొక్కలు కూడా సిద్ధం చేశారు.

ప్రస్తుతం మన దేశంలో గంధం కొరత ఉండటంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో కేరళ, తమిళనాడు  ప్రభుత్వాలు ఇప్పటికే సాండల్ ఉడ్‌‌ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇదే తోవలో మన రాష్ర్ట రైతులతోనూ శాండల్‌‌ ఉడ్‌‌ సాగు చేయించాలని నిర్ణయించారు. కేరళ నుంచి అత్యంత నాణ్యమైన శాండల్‌‌ ఉడ్‌‌ విత్తనాలు తెప్పించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో 10.5 లక్షలు, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మరో 10 లక్షల గంధం మొక్కలు పెంచుతున్నారు. జూన్‌‌లో ప్రారంభం కానున్న ఐదో విడత హరితహారంలో భాగంగా వీటిని రైతులకు పంపిణీ చేయనున్నారు.