
బీజింగ్: వరల్డ్ నంబర్ వన్ ఆర్చర్, పారాలింపిక్స్ చాంపియన్ హర్విందర్ సింగ్ ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రెండు గోల్డ్, ఒక సిల్వర్‌తో సత్తా చాటాడు. ఈ మెగా టోర్నీలో ఇండియా మొత్తం 9 మెడల్స్‌తో రెండో ప్లేస్ సాధించింది. మూడేసి స్వర్ణాలు, రజతాలు, కాంస్య పతకాలు గెలిచింది. మెన్స్ రికర్వ్ ఓపెన్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో 663 పాయింట్లు సాధించి వ్యక్తిగత రికార్డుతో పాటు కొత్త పోటీ రికార్డును నెలకొల్పిన హర్విందర్ తొలుత భావనతో కలిసి రికర్వ్ ఓపెన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం గెలిచాడు.
ఫైనల్లో ఇండియా జోడీ 5–-4 (14-–8) తేడాతో చైనా జోడీ జిహాన్ గావో– జున్ గాన్ ను ఓడించింది. ఆపై, మెన్స్ ఓపెన్ ఫైనల్లో హర్విందర్ 7-–1 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన హాన్‌రూచై నెట్సిరిని ఓడించి రెండో గోల్డ్ అందుకున్నాడు. అయితే, రికర్వ్ మెన్స్ డబుల్స్‌లో వివేక్ చికారాతో కలిసి బరిలోకి దిగిన హర్విందర్.. 4–5 (17–18)తో చైనా జోడీ చేతిలో షూటాఫ్‌లో ఓడిపోయి రజతం ఖాతాలో వేసుకున్నాడు. విమెన్స్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో శీతల్ దేవి– జ్యోతి 148–-143 తో చైనాకు చెందిన లూ జాంగ్– జింగ్ జావో (చైనా)పై నెగ్గి ఇండియాకు మూడో స్వర్ణం అందించారు.