స్టూడెంట్స్‌ను కర్రలతో బాదేసిన ముగ్గురు టీచర్లు

స్టూడెంట్స్‌ను కర్రలతో బాదేసిన ముగ్గురు టీచర్లు

క్లాసులో ఎవరో ఒక స్టూడెంట్ విజిల్ వేశాడు. పాఠం చెబుతుంటే విజిల్ వేయడంపై టీచర్‌‌కు కోపం వచ్చింది. ఈ పని చేసిందెవరో చెప్పండ్రా అంటూ మాస్టర్ సీరియస్‌గా అడగడంతో పిల్లలంతా భయంపడి ఏ ఒక్కరూ నోరు విప్పకుండా సైలెంట్‌గా కూర్చున్నారు. దీంతో కోపం పట్టలేక మరొ ఇద్దరు టీచర్లను పిలుచుకొచ్చి స్టూడెంట్స్ తీరుపై మండిపడ్డారు. విజిల్ వేసిందెవరో చెప్పకపోతే అందరికీ దెబ్బలు పడుతాయని ఆ ముగ్గురు టీచర్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో కర్రలు తీసుకొచ్చి క్లాసులో ఉన్న మొత్తం 40 మంది స్టూడెంట్స్‌ను బాదేశారు. దీంతో పది మందికి తీవ్రగాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా తొహనాలోని గవర్నమెంట్ స్కూల్‌లో సోమవారం నాడు జరిగింది. దీంతో ఆ టీచర్లపై పిల్లల పేరెంట్స్‌ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.

దళిత స్టూడెంట్లను కులంతో దూషించి..

సోమవారం ఉదయం స్కూలులో 11వ తరగతి స్టూడెంట్స్‌కు క్లాస్‌ జరుగుతుండగా ఒక విద్యార్థి విజిల్ వేశాడు. అయితే ఈ పని చేసిందెవరో చెప్పకపోవడంతో మంగే రామ్, రజనీ, చరణ్‌జిత్‌ సింగ్ అనే ముగ్గుర టీచర్లు కలిసి పిల్లలను గొడ్డును బాదినట్లు బాదారంటూ పేరెంట్స్‌ పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. 40 మంది పిల్లల్లో పది మందికి తీవ్రమైన గాయాలయ్యాయని, వాళ్లు  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులకు వివరించారు. అయితే ఆ టీచర్లు పిల్లలను కొట్టేటప్పుడు ఇద్దరు దళిత స్టూడెంట్లను కులం పేరుతో నోటికొచ్చినట్టు దూషించారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. స్కూల్‌లో జరిగిన ఈ ఘటన గురించి పేరెంట్స్‌కు చెప్పొద్దని, అలా కాదని చెబితే స్కూల్‌ అడ్మిషన్‌నే రద్దు చేస్తామని చరణ్‌జిత్ సింగ్‌ అనే టీచర్ బెదిరించాడని పేరెంట్స్ తెలిపారు. అంతటితో ఆగకుండా లేడీ టీచర్లను ఆ స్టూడెంట్స్ లైంగికంగా వేధిస్తున్నారని కేసు పెడతామని కూడా వార్నింగ్ ఇచ్చాడని పోలీసులకు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.