మత మార్పిడుల నిరోధక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం

మత మార్పిడుల నిరోధక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం

చట్ట వ్యతిరేక, బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్స్ ఆఫ్ రిలిజియన్ బిల్లు 2022పై మంగళవారం అసెంబ్లీలో చర్చకు పెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఉన్న చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే చాలని కాంగ్రెస్ పార్టీ వాదించగా.. ఈ బిల్లు ఏదో ఒక మతానికి ఉద్దేశించి తెచ్చినది కాదని, ఏ మతం నుంచి మరే మతంలోకి బలవంతపు మార్పిడులు చేసినా దీని ప్రకారం శిక్షంచవచ్చని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయగా.. బీజేపీ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో బిల్లును సమర్థించారు.

ఏ విధమైన మతమార్పిడులు చట్ట వ్యతిరేకం?

స్వచ్ఛందంగా ఎవరైనా ఏ మతాన్నైనా పాటించొచ్చు. కానీ అలా కాకుండా తప్పుడు అర్థాలు, తప్పుడు భావనలు చూపిస్తూనో లేదా బలవంతంగానో, ఏదో ఒక రకమైన ప్రలోభాలతోనో, మోసపూరిత మార్గాల ద్వారానో, పెళ్లి ద్వారానో మత మార్పిడికి పాల్పడితే చట్ట వ్యతిరేకమని ఈ బిల్లులో పేర్కొన్నారు.  

శిక్షలివే

చట్ట వ్యతిరేకంగా మత మార్పిడులకు పాల్పడితే ఏడాది నుంచి ఐదేండ్ల పాటు జైలు శిక్ష లేదా రూ.లక్షకు తక్కువ కాకుండా జరిమానా లేదా రెండు శిక్షలు ఒకేసారి వేసేలా ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్స్ ఆఫ్ రిలిజియన్ బిల్లు 2022లో ప్రతిపాదించారు. అయితే ఎస్సీ లేదా ఎస్టీ కులాలకు చెందిన మైనర్ లేదా మహిళలు లేదా ఈ వర్గాల్లో ఎవరినైనా చట్ట వ్యతిరేకంగా మత మార్పిడి చేయాలని చూస్తే కనీసం నాలుగేండ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.3 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించాలని బిల్లులో పెట్టారు.

కొత్తగా చట్టమెందుకు?

హర్యానా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మత మార్పిడుల నిరోధక బిల్లును పెట్టడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు ఇప్పటికే చట్టం ఉందని, అందులోనూ శిక్షలు ఉన్నాయని ప్రతిపక్ష నేత భూపేంద్ర సింగ్ హుడా అన్నారు. ఇప్పుడు కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. హర్యానా చరిత్రలో ఇదొక బ్లాక్ చాప్టర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ చౌదరి అన్నారు. ఈ బిల్లు వల్ల మత పరమైన విభజన మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ సింగ్ అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ విమర్శలపై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ క్లారిటీ ఇచ్చారు. తాము ఏ ఒక్క మతాన్నో ఉద్దేశించి ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని చెప్పారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించాలన్న ఆలోచనతోనే ఈ బిల్లు తెచ్చామని, ఏ మతం నుంచి మరో మతంలోకి చట్ట వ్యతిరేకంగా కన్వర్షన్ చేసినా చర్యలు ఉంటాయని వివరించారు.

మరిన్ని వార్తల కోసం..

గుడ్డేలుగు వేషం.. కోతులు మాయం

ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మొగిలయ్యకు వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం