పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నం... రైతులకు సీఎం గుడ్ న్యూస్

  పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నం... రైతులకు సీఎం గుడ్ న్యూస్

 హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.  రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా  పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లుగా ప్రకటించారు.  2023 సెప్టెంబ‌ర్ 30 నాటికి పంట రుణాల‌పై వడ్డీ, పెనాల్టీల‌ను మాఫీ చేస్తున్నామ‌ని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. 2024 మే 31లోగా అస‌లు మొత్తాన్ని చెల్లించే రైతుల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. ఎంఎఫ్ఎంబీ (మేరీ ఫ‌స‌ల్ మేరీ బ్యోరా) వ‌ద్ద న‌మోదైన రైతుల‌కు ఈ ప‌ధ‌కం వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.  

పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు నిరసనలు చేస్తున్న తరుణంలో  రైతుల సంక్షేమం కోసం హర్యానా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇస్తున్నామని ఖట్టర్  తెలిపారు.  కాగా  2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ   రూ.1.89 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించింది ఖట్టర్ సర్కార్.   

సీఎం ఈ ప్రకటన చేయగానే ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ..రైతులు గురించి మాట్లాడుతున్న మీరు హ‌రియాణ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పై ఎందుకు నాసా చట్టాన్ని ప్రయోగిస్తున్నార‌ని నిల‌దీశారు. దీనిపై సీఎం సమాధానం ఇస్తూ  తాను రైతు  బిడ్డనేన‌ని, రైతుల బాధ త‌న‌కు తెలుసునన్నారు. రైతుల కోసం ప‌ధ‌కం ప్రక‌టిస్తే దాన్ని మీరు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని విమర్శించారు.