హర్యానా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కోట్లల్లో డబ్బు.. తుపాకులు

హర్యానా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కోట్లల్లో డబ్బు.. తుపాకులు
  • 5 కిలోల గోల్డ్, ఖరీదైన 100 లిక్కర్​ బాటిళ్లు.. సీజ్ చేసిన ఈడీ

న్యూఢిల్లీ :  హర్యానాలో  ఇండియన్​ నేషనల్​ లోక్ దళ్ (ఐఎన్ఎల్​డీ) పార్టీ మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్​ సింగ్​ ఇంటిపై ఎన్​ఫోర్స్​మెంట్ ​డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన రెయిడ్స్​లో భారీగా డబ్బు, విదేశీ తుపాకులు, వందల బుల్లెట్లు, కిలోలకొద్దీ బంగారం, ఖరీదైన లిక్కర్​ పట్టుబడింది. అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వర్, మాజీ ఎమ్మెల్యే దిల్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఆయన సన్నిహితుల ఇండ్లపై ఈడీ గురువారం ఉదయం దాడులు చేసింది. రైడ్స్​శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ తనిఖీలో బయటపడుతున్న డబ్బు, బంగారం, తుపాకులను చూసి ఈడీ ఆఫీసర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. యమునానగర్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ మైనింగ్​పై 2013లో పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఏడాది మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో వీరు నిందితులు. హర్యానా 2020లో తీసుకొచ్చిన ‘ఇ– రవాణా’ అనే విధానాన్ని కాపీ కొడుతూ వీరిద్దరు నకిలీ బిల్లులు ఇస్తున్నట్లు ఈడీ ఆరోపించింది.