- ఓటర్ జాబితాలో 12.5% నకిలీ..ప్రతీ 8 మందిలో ఒకరు నకిలీ
- బీజేపీ గెలిచేందుకు ఎన్నికల సంఘం సహకరించింది
- బ్రెజీల్ మోడల్ ఫొటోతో 10 బూత్‌లలో 22సార్లు ఓట్లు
- హైడ్రోజన్ బాంబ్ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గతంలో చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ (ఈసీ)పై హైడ్రోజన్ బాంబ్ పేల్చారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. లేకుంటే 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ఉండేదని అన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
హెచ్–ఫైల్స్ పేరుతో హైడ్రోజన్ బాంబు లాంటి సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఓట్ల చోరీచేసి ఎన్నికల్లో గెలిచేలా బీజేపీకి ఈసీ సహకరిస్తున్నదని అనేందుకు తన దగ్గర ఉన్న ‘హెచ్’ ఫైల్స్ రుజువులుగా నిలుస్తున్నాయని తెలిపారు.
తాను100% పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. సీమా, స్వీటీ, సరస్వతి పేరుపై ఓ బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో కూడిన ఐడీతో ఓ మహిళ రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 10 బూత్‌లలో 22 సార్లు ఓట్లు వేసిందన్నారు. ఒకే ఒక్క ఫొటోపై 223 ఓట్లను జారీ చేశారని అన్నారు. ‘ఇంతకీ ఆమె ఎవరు ?’ అని ఈసీని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. ఇలాంటి 25 లక్షల ఓట్లు హర్యానాలో ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ఓటమి కోసం ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’
బీజేపీతో ఎలక్షన్కమిషన్చేతులు కలిపిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తో పాటు ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్లు.. ప్రధాని మోదీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ని నిర్వహించారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, హర్యానా సీఎం నాయబ్‌సింగ్ సైనీ దొంగ ఓట్లతో గెలిచారని, వారు చట్టబద్ధంగా ప్రభుత్వంలో లేరని వ్యాఖ్యానించారు. ఓట్లచోరీ ద్వారా యువత భవిష్యత్తును లాక్కుంటున్నారని, ఈ అంశాన్ని జన్ జడ్ యువత సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. జన్ జడ్ యువతకు సత్యం, అహింసతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే శక్తి ఉన్నదని, అందుకోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
హర్యానాలో జరిగినవి ఎన్నికలు కాదని.. అవి ఓట్ల దొంగతనం అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉంటే 25,41,144 మంది నకిలీ ఓటర్లున్నారు. వీరిలో 5,21,619 మంది డూప్లికేట్ ఓటర్లు, 93,174 చిరునామాలు చెల్లనివి, 19,26,351 మంది బల్క్ ఓటర్లు’’ అని ఆరోపించారు.ఈ లెక్కన ప్రతీ 8 మంది హర్యానా ఓటర్లలో ఒకరు నకిలీనేనని, అంటే రాష్ట్రంలో దాదాపు 12.5 శాతం మంది నకిలీ ఓటర్లున్నారని తెలిపారు. పోస్టల్ ఓట్లు, బూత్ ఓట్ల లెక్కల్లోనూ పెద్ద తేడాలు కనిపిస్తున్నాయని, దీనిపై కూడా తమ పార్టీ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు.
రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ, ఈసీ
హర్యానాలో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అవి తప్పుడు వ్యాఖ్యలు, ఆధారాలు లేనివని కొట్టిపారేసింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దేశ ప్రజాస్వామ్యాన్ని అపకీర్తి పాలు చేసేందుకు ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఓటింగ్‌లో ఏదైనా అక్రమం ఉంటే దాన్ని ఈసీకి ఫిర్యాదు చేయాలని లేదా కోర్టును ఆశ్రయించాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సూచించారు.
కానీ అతను (రాహుల్‌గాంధీ) ఎప్పుడూ అలా చేయడు అని చురకలంటించారు. కాగా.. రాహుల్‌గాంధీ ఆరోపణలు నిరాధారమని ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా తోసిపుచ్చారు. హర్యానాలో ఎన్నికల జాబితాలపై ఎలాంటి అప్పీల్స్ దాఖలు కాలేదని చెప్పారు. ‘‘రాహుల్ గాంధీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా..? హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితాపై కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు. ఓట్ చోరీ జరుగుతుంటే పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు ఏంచేస్తున్నారు’’ అని ఈసీ ప్రశ్నించింది.
బిహార్‌లోనూ ఓట్ల చోరీ జరగబోతున్నది..
మొత్తం హర్యానా వ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందని, అందుకే దానికి సంబంధించిన ఆధారాలకు హెచ్–ఫైల్స్ అనే పేరు పెట్టామని రాహుల్‌గాంధీ వివరించారు. ఇండ్లు లేని వాళ్లకు ఇంటి నంబర్‌గా జీరోను కేటాయిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అబద్ధాలు చెబుతున్నారని, ఆ ఇండ్ల పేరుతో ఏంజరుగుతున్నదో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని అన్నారు. డూప్లికేట్ ఓట్లను ఎందుకు తొలగించడంలేదని ఈసీని ఆయన ప్రశ్నించారు. వాటిని తొలగిస్తే ఎన్నికల్లో సరైన ఫలితం వస్తుందన్నారు.
ఈ ఓట్ల చోరీ ఒక్క హర్యానాకే పరిమితం కాలేదని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నామని చెప్పారు. అందుకే హర్యానాలో ఓట్లచోరీపై ఫోకస్ పెట్టి పూర్తి సమాచారాన్ని సేకరించామని, ఓట్లచోరీ వల్లే గెలవాల్సిన హర్యానాను తాము కోల్పోయామని చెప్పారు.
ఇప్పుడు బిహార్‌లోనూ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని అన్నారు. ఈ ఓట్‌చోరీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి సమన్వయంతో పోరాడుతాయని చెప్పారు. సుప్రీంకోర్టు అన్నీ చూస్తోందని, ఈ దొంగతనం ఎన్నటికీ దాగదని రాహుల్ వ్యాఖ్యానించారు.
