రోడ్డెక్కిన హర్యానా రైతులు

రోడ్డెక్కిన హర్యానా రైతులు
  • పొద్దుతిరుగుడు పంటకు ఎంఎస్పీ కోసం డిమాండ్

పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర  కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా రైతులు మళ్లీ రోడ్డెక్కారు. సీఎం ప్రకటించిన పరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కురుక్షేత్రలోని ఢిల్లీ - చండీగఢ్ హైవేని బ్లాక్ చేశారు.


కురుక్షేత్ర: పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా రైతులు మళ్లీ రోడ్డెక్కారు. సీఎం ప్రకటించిన పరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కురుక్షేత్రలోని ఢిల్లీ-చండీగఢ్ హైవేను  బ్లాక్ చేశారు. సోమవారం పిప్లిలోని వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతీయ కిసాన్ యూనియన్ (చారుణి) ‘ఎంఎస్పీ ఇప్పించండి.. రైతులను బతికించండి’ అంటూ మహాపంచాయత్ నిర్వహించారు. తర్వాత వందలాది మంది నేషనల్ హైవే 44పైకి వచ్చారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను మళ్లించారు. ‘‘మా డిమాండ్లపై చర్చించేందుకు సీఎం మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్ ఖట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని స్థానిక అధికారులు మాటిచ్చారు. కానీ ఇప్పుడేమో కర్నాల్‌‌‌‌‌‌‌‌ నుంచి సీఎం వెళ్లిపోయారని చెబుతున్నారు. అందుకే మహాపంచాయత్ నిర్వహించాం. మా డిమాండ్లు నెరవేరే వరకు నేషనల్ హైవే 44ను బ్లాక్ చేయాలని నిర్ణయించాం” అని రైతు నేత కరమ్ సింగ్ మథన చెప్పారు. ఈ ఆందోళనల్లో హర్యానాతోపాటు యూపీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రైతు నేతలు కూడా పాల్గొన్నారు.

పాన్ ఇండియా ఆందోళన చేస్తాం: తికాయత్

పొద్దుతిరుగుడు పంటను ఎంఎస్పీతో కొనుగోలు చేయాలని, షాహాబాద్‌‌‌‌‌‌‌‌లో అరెస్టు చేసిన రైతు నేతలను రిలీజ్ చేయాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు. మహాపంచాయత్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఎంఎస్పీపై చట్టం తీసుకురాకపోతే పాన్ ఇండియా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎంఎస్పీని ప్రకటించిన కేంద్రం.. దాని ప్రకారం పంటలను కొనుగోలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

15 వరకు ఆందోళన వాయిదా: బజరంగ్​

ఈ మహాపంచాయత్‌‌‌‌‌‌‌‌కు ఒలింపిక్​ పతక విజేత, రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా హాజరయ్యాడు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో చేస్తున్న ఆందోళనలను ఈ నెల 15 దాకా వాయిదా వేసినట్లు బజరంగ్ వెల్లడించాడు. ఆ లోపు బ్రిజ్ భూషణ్‌‌‌‌‌‌‌‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పాడు. 

ఆరు రోజుల కిందట కూడా..

ఈ నెల 6న కూడా బీకేయూ(చారుణి) చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి ఆధ్వర్యంలో షాహాబాద్‌‌‌‌‌‌‌‌ వద్ద నేషనల్ హైవే 44 బ్లాక్ చేశారు. మద్దతు ధరకు పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

8,528 మంది రైతులకు రూ.29 కోట్ల పరిహారం

కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మిన రైతులకు క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున పరిహారాన్ని భావంతర్ భార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పయ్ యోజన కింద హర్యానా ప్రభుత్వం ఇస్తున్నది. 36,414 ఎకరాల్లో సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్స్ పండించిన 8,528 మంది రైతులకు రూ.29.13 కోట్ల పరిహారాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారమే రిలీజ్ చేశారు. ఈ పరిహారంతో సంతృప్తి చెందని రైతులు ఇలా ఆందోళనకు దిగారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీతో క్వింటాలుకు రూ.6,400 చొప్పున కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.