మహాభారతాన్ని భావితరాలకు అందించాలి

మహాభారతాన్ని భావితరాలకు అందించాలి

మహాభారతం గొప్పకావ్యమని దాన్ని విద్యార్థులకు అందించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన శ్రీమద్భ మహాభారత అవతరణ సహస్రాబ్ది, నన్నయ సహస్రాబ్ది మహోత్సవాల్లో దత్తాత్రేయ పాల్గొన్నారు. తెలుగు భాష జీవన మూలాలను దృష్టిలో ఉంచుకుని నన్నయ మహాభారతం రచించారని దత్తాత్రేయ చెప్పారు. మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని సూచించారు.  

మహాభారతం మానవ జీవితంలో ఇమిడివుంది 

తెలుగు భాషా ఎంతో ప్రాచీన భాష అని, దాన్ని అజరామరంగా ఉంచాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వ్యక్తిపై ఉందని టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న సమయంలో అందరం దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహాభారతం అనేది మానవ జీవితంలో చాలా లోతుగా ఇమిడివుందన్న ఆమె.. ప్రతి ఒక్కరు దీనిని చదవాలన్నారు. 

మహాభారతం గురించి చాలా మందికి తెలియదు

మహాభారతం గురించి చాలా మందికి ఇంకా తెలియదని, దాన్ని అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. భాషను బతికించేందుకు సాయం చేసిన ప్రతి రాజు చరిత్రలో నిలిచిపోయారన్నారు. నన్నయ వల్లే రాజారాజా నరేంద్రుడికి మంచి పేరు వచ్చినట్లు పేర్కొన్నారు. మహాభారతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రాశి కేర్స్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు.