న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డిజిటల్ సెటైరికల్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఫౌండర్ అభిజిత్ దీప్కేకు ఊహించని షాక్ తగిలింది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన లాయర్ సుధీర్ జాఖర్ కాక్రోచ్ జనతా పార్టీని తన పేరు మీద అధికారిక రాజకీయ పార్టీగా నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29A కింద ఈసీ కార్యదర్శికి దరఖాస్తు సమర్పించారు.
పార్టీ జాతీయ కన్వీనర్‌గా తనను తాను ప్రకటించుకున్న సుధీర్ జాఖర్.. దరఖాస్తులో పార్టీ గుర్తును బొద్దింక చిహ్నంగా పేర్కొన్నారు. దరఖాస్తుకు సంబంధించిన మిగిలిన లాంఛనాలను పూర్తి చేయడానికి అతను ఎన్నికల అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఆమోదం తెలిపి రిజిస్ట్రేషన్ పూర్తి అయితే సోషల్ మీడియాలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఒక అధికారిక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.
కానీ పార్టీ గుర్తు మాత్రం బొద్దింక వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కోసం ఒక నిర్దిష్ట నియమావళి ప్రకారం స్వేచ్ఛా చిహ్నాల జాబితాను ఈసీ నిర్వహిస్తుంది. వన్యప్రాణుల రక్షణ జంతువులపై క్రూరత్వం నిరోధించాలనే ఉద్దేశంతో జంతువులు, పక్షుల చిహ్నాలను దాదాపు ఈసీ నిషేధించింది. అయితే, ఫ్రీ సింబల్స్‌లో ఏనుగు, సింహం గుర్తులకు మాత్రమే ఈసీ మినహాయింపు ఇచ్చింది. ఈసీ ఫ్రీ సింబల్స్ జాబితాలో బొద్దింక వంటి కీటకాలు లేవు. సో.. కాక్రోచ్ జనతా పార్టీకి పార్టీ సింబల్‌గా బొద్దింక కేటాయించే అవకాశం లేదు.
ఈ మేరకు సుధీర్ జాఖర్ మాట్లాడుతూ.. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే భారతదేశానికి వచ్చి ఈ ఉద్యమాన్ని ఒక క్షేత్రస్థాయి రాజకీయ పార్టీగా మార్చడానికి నిరాకరించారని తెలిపారు. యువతలో ఉన్న ఆగ్రహాన్ని.. కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తోన్న ఆదరణ చూసి ఇతరులు ఈ పేరును నమోదు చేసుకుని దుర్వినియోగం చేస్తే ఈ ఉద్యమం మొత్తం నాశనమవుతుందని పేర్కొన్నారు. అలా జరగకుండా అడ్డుకోవడానికే మేమే స్వయంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని.. ఇందులో భాగంగానే ఈసీని ఆశ్రయించి కాక్రోచ్ జనతా పార్టీని తమ పేరిట అధికారిక రిజిస్ట్రేషన్ చేయాలని కోరామని తెలిపారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు..
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుండటం.. పెరగని జీతాలు.. పడిపోతున్న రూపాయి.. పైకి ఎగబాకుతున్న ధరలు.. మారని బతుకులు.. మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు.. ఎటుచూసినా అవినీతి, అక్రమాలు.. ఒక్కటేమిటి..? దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది ఆ పార్టీనే ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’.
మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టిందీ పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్‌జీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది.
