నూహ్‌లో సాధువుల అడ్డగింత..ఆమరణ దీక్షకు దిగిన అయోధ్య పీఠాధిపతి

నూహ్‌లో సాధువుల అడ్డగింత..ఆమరణ దీక్షకు దిగిన అయోధ్య పీఠాధిపతి

హర్యానా రాష్ట్రంలోని నూహ్‌  జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన  బ్రజమండల్ జలాభిషేక యాత్రను విశ్వహిందూ పరిషత్ ఆగస్టు 28వ తేదీన నిర్వాహించాలని నిర్ణయించడంతో హర్యానా ప్రభుత్వం, నుహ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నుహ్ జిల్లాతో పాటు..సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. 

సరిహద్దుల్లోనే అడ్డగింత

నూహ్‌లోని నల్హత్‌ ఆలయంలో ఆగస్టు 28వ తేదీ  సోమవారం ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అయితే ఈ పూజలతో పాటు..  బ్రజమండల్ జలాభిషేక యాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి కొంతమంది సాధువులు నుహ్ జిల్లాకు వస్తుండగా.. వారిని సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

నిరాహార దీక్ష..
తమను నుహ్ సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకోవడంపై అయోధ్య పీఠాధిపతి జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా  సోహ్నా టోల్ ప్లాజా వద్ద  తాను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను మరణించే వరకు ఎలాంటి ఆహారం తీసుకోనని అక్కడే కూర్చున్నారు. 

జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను విశ్వహిందూ పరిషత్ ఆగస్టు 28వ తేదీన నిర్వహించాలని  నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం, నూహ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా నుహ్ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేవారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు  ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

 144 సెక్షన్  విధింపు

 బ్రజమండల్ జలాభిషేక యాత్రకు అనుమతి లేకపోవడంతో నుహ్ జిల్లా ఉన్నతాధికారులు సెక్షన్ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు గుంపులు, గుంపులుగా తిరగొద్దని ఎస్‌డీఎం అశ్వనీ కుమార్ జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.  మొబైల్‌ ఇంటర్నెట్‌, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేశారు. అటు శోభాయాత్ర సందర్భంగా హర్యానా ప్రభుత్వం నుహ్ జిల్లాలో 1,900 మంది పోలీసు సిబ్బంది, 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద మోహరించింది.