హర్యానాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

హర్యానాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

హర్యానా నుహ్  జిల్లాలో రెండు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో హర్యానా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు ఖట్టర్ సర్కార్ చర్యలు చేపట్టింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో రేపటి వరకు ఇంటర్ నెట్  సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 114 సెక్షన్ అమలు చేస్తున్నామన్న పోలీసులు.. రోడ్లపై జనం గుమిగూడడాన్ని నిషేధించారు.
 

సోమవారం నుహ్ లో ఓ వర్గం నిర్వహించిన యాత్రను మరో వర్గానికి చెందిన కొందరు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. అల్లరిమూకలు ఊరేగింపులో పాల్గొన్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లలో ఇద్దరు హోం గార్డులు మృతి చెందగా.. మరి కొంతమంది స్థానికులతోపాటు పోలీసులకు గాయాలయ్యాయి. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కల్గకుండా అందరూ సహకరించాలని సీఎం మనోహర్ లాల్ కట్టర్ విజ్ఞప్తి చేశారు. ఓ సంస్థకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదని గురుగ్రామ్ డిప్యూటి కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు  అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటు నుహ్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా గుర్ గ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్.