
ITR Filing: భారతదేశంలో చాలా మందికి తాము ఆదాయపు పన్ను కట్టాలా అక్కర్లేదా అనే అనుమానం ఉంటుంది. ఒకవేళ కట్టాల్సి వస్తే దానిని ఎలా గుర్తించాలి.. ఏ నిబంధనలు వర్తిస్తే టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి వంటి అనుమానాలు సహజంగానే వస్తుంటాయి. ప్రస్తుతం ఐటీఆర్ ఫైలింగ్ కోసం సెప్టెంబర్ వరకు గడువు పొడిగించిన సమయంలో ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన నిబంధనల గురించి తెలుసుకుందాం..
* మీ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించితే పన్ను చట్టాల ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేయటం తప్పనిసరి.
* మీరు ఎక్కడైనా పొందిన ఆదాయంపై టీడీఎస్ కట్ అయ్యి దానిని తిరిగి క్లెయిమ్ చేసుకోవాలంటే అందుకోసం ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
* మీకు విదేశాల్లో ఏవైనా పెట్టుబడులు లేదా ఆస్తులు ఉన్నప్పుడు వాటి ద్వారా ఆదాయాన్ని పొందితే తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేసి అందులో చూపించాలి.
* విదేశీ పర్యటనలకు వెళ్లి రూ.2 లక్షల కంటే ఎక్కువ అక్కడ ఖర్చు చేస్తే చట్టప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
* వార్షికంగా మీరు లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ బిల్లు కడుతున్నట్లయితే ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే.
* ఇక చివరిగా మీరు ఏదైనా ఆస్తులు అమ్మినప్పుడు లేదా పెట్టుబడులపై వాటి ద్వారా మూలధన లాభాలను పొందినప్పుడు టాక్స్ రిటర్న్ ఫైలింగ్ తప్పనిసరి.
పన్ను చట్టం చెప్పిన దానికంటే తక్కువ ఆదాయం ఉన్నా లేదా కేవలం వ్యవసాయం నుంచి మాత్రమే ఆదాయం పొందుతున్నప్పటికీ కొంతరు వ్యక్తులు జీరో రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. వరుసగా మూడేళ్ల పాటు ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేసిన వ్యక్తులకు రుణాలను ఇచ్చేటప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఉదాహరణకు హోం లోన్ లేదా కార్ లోన్ వంటివి తీసుకుంటున్నప్పుడు ఐటీ రిటర్న్స్ సమాచారాన్ని బ్యాంకులు కస్టమర్లను అడుగుతుంటాయి. అందువల్ల పైన సూచించిన నిబంధనలు మీకు వర్తించనప్పటికీ టాక్స్ రిటర్న్ దాఖలు చేయటం తప్పు కాదని గుర్తుంచుకోండి.