
భారతదేశం.. దేవాలయాలకు.. పుణ్య క్షేత్రాలకు ప్రసిద్ది. ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. సాధారణంగా భారతదేశంలోని గుళ్లలో నిత్యం పూజలు చేస్తారు. కాని మధ్య ప్రదేశ్ లోని ఓ దేవాలయం మాత్రం ఏడాదికి ఒక్కరోజే తెరుస్తారు. శ్రావణమాసంశుక్ల పక్షం పంచమి తిథి రోజున అంటే నాగ పంచమి రోజు తెరిచి ఘనంగా నాగేంద్రస్వామికి ఘనంగా పూజలు చేస్తారు.. ఏడాదిలో ఒక్కరోజే ఓపెన్ చేసే దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . .
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ నాగ చంద్రేశ్వర ఆలయం ఏడాదిలో ఒక్కరోజే మాత్రమే తెరుస్తారు. నాగుల పంచమికి ముందు రోజు రాత్రి 12 గంటలకు తెరిచి, పంచమి రోజు రాత్రి 12 గంటలకు మూసివేస్తారు. శేషతల్పంపై శివపార్వతులు ఉన్న ఏకైక ఆలయమిది. ఆలయంలో పాములు సంచరిస్తాయని, తక్షకుడు ఇక్కడ తపస్సు చేశాడని భక్తుల నమ్మకం. ఈ ఏడాది జులై 29న అంటే నేడు నాగులపంచమి సందర్భంగా నాగచంద్రేశ్వర ఆలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచారు.
దేశవ్యాప్తంగా నాగ పంచమి పండుగను ఈ రోజు ( జులై 29) ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అలయాలను దర్శించుకుని పుట్టలో పాలు పోస్తూ పూజలు చేశారు. నాగ పంచమి రోజును పురస్కరించుకుని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం తెరుచుకుంది.
ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. అది కూడా శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజు మాత్రమే. అందుకే ఈ ఏడాది నాగ పంచమికి ముందు అంటే ఈ ఏడాది జులై 28 వ తేదీ అర్థరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నాగదేవతను దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలబడి పూజలు చేశారు. మళ్లీ ఈ రోజు (జులై 29) అర్దరాత్రి 12 గంటలకు మూసేస్తారు. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల పాముకాటు భయం ఉండదని, జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున ( జులై 29) వాసుకి, మణిభద్ర, కాళిక, ధనంజయ, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన వారిని పూజించే సంప్రదాయం ఉంది.
దేశంలోనే ప్రత్యేకమైన ఈ ఆలయ తలుపులు నాగ పంచమి రోజున సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి సంవత్సరం నాగ పంచమికి ఒక రోజు ముందు అర్ధరాత్రి నుండి ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు క్యూ కడతారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాకాళేశ్వర ఆలయంలో నాగపంచమి రోజున నాగచంద్రేశ్వరుని దర్శనం చాలా ప్రత్యేకమైనది.
జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళ ఆలయ సముదాయంలో చాలా పురాతనమైన నాగచంద్రేశ్వరుని ఆలయం ఉంది. ఈ ఆలయంలో పాముపై కూర్చున్న శివ-పార్వతి విగ్రహం చాలా అరుదైనది. ఆలయంలోని నాగచంద్రేశ్వరుని విగ్రహాన్ని దర్శించి పూజించడం ద్వారా శివపార్వతులిద్దరూ సంతోషిస్తారని, పాముల భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
శేషనాగుపై శివపార్వతులు
సాధారణంగా విష్ణుమూర్తి శేషనాగుపై శయనిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం శివపార్వతులు శేషనాగు మీద శయనిస్తారు. వీరితో పాటు వినాయకుడు కూడా ఉంటాడు. ఈ విగ్రహం చాలా పురాతమైనది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. నాగులకు రాజుగా భావించే తక్షకుడు ఈ ఆలయంలో నివసిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు.
నాగపంచమి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి కాలసర్ప దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. . ఇక్కడ స్వామి వారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం మాత్రమే ఉండటం వల్ల భక్తులు లక్షల్లో వస్తారు.
ఈఏడాది జులై 28 న అర్దరాత్రి పూజలు చేసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులందరూ పాల్గొన్నారు. తలుపులు తెరిచిన అనంతరం నాగచంద్రేశ్వరునికి విధివిధానాల ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు ( జులై 29) ప్రజలు ఈ ఆలయంలో రోజంతా నాగచంద్రేశ్వరుని దర్శనం చేసుకుంటారు.
దేవాలయ చరిత్ర
పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని మహాకాళ వన అని పిలిచేవారు. తక్షకుడు అనే నాగు ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. నేటికీ నాగచంద్ర దేవాలయంలో తక్షక్ నాగ్ నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ సందర్శిస్తే కాలసర్ప దోషం అశుభ ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.